షర్మిలకు షాకిచ్చిన జగన్.. కడప ఎంపీగా వైఎస్ భారతి!!

 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో పడిపోయాయి. అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రచనతో పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. అయితే ఇంకా పార్టీలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే.. 'అక్కడి నుంచి వీళ్ళు పోటీ చేస్తున్నారు, ఇక్కడి నుంచి వాళ్ళు పోటీ చేసున్నారు' అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గుడివాడలో కొడాలి నానికి పోటీగా టీడీపీ తరుపున దేవినేని అవినాష్ బరిలోకి దిగుతాడని వార్తలొచ్చాయి. అదే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. కడప ఎంపీగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి బరిలోకి దిగబోతున్నారట.

2014 ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసారు. వారిలో అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా కడప ఎంపీగా వైసీపీ తరుపున అవినాష్ రెడ్డి బరిలోకి దిగుతారని భావించారంతా. కానీ జగన్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నారట. దానికి కారణం మంత్రి ఆదినారాయణ రెడ్డి. 2014 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే ప్రస్తుతం కడప టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. టీడీపీ తరుపున కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆదినారాయణ రెడ్డి నుంచి అవినాష్ రెడ్డికి గట్టి పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీకి కడప కంచుకోటలా చెప్పుకుంటారు. అలాంటి చోట టీడీపీ ఎంపీ గెలిస్తే ఇంకేమన్నా ఉందా? వైసీపీకి తీవ్ర నష్టం జరగుతుంది. అందుకే జగన్.. అవినాష్ రెడ్డి కంటే తన కుటుంబం నుంచే ఎవరినైనా బరిలోకి దించడం బెటర్ అనుకుంటున్నారట. దానివల్ల ఆదినారాయణ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు ఉంటుంది. అదేవిధంగా కడపలో వైసీపీ బలం అలాగే ఉందని రుజువు చేసినట్టు ఉంటుందని జగన్ భావిస్తున్నారట.

అయితే జగన్ కుటుంబం నుంచి ఇప్పటికే రాజకీయ అనుభవం ఉన్న ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఉన్నారు. కానీ జగన్ మాత్రం సతీమణి భారతి వైపే మొగ్గుచూపుతున్నారట. గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె అంతగా ఆసక్తి కనబరచట్లేదట. అయితే షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప ఎంపీగా పోటీ చేయడానికి ఆమె ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే జగన్ మాత్రం భారతిని కడప ఎంపీ బరిలో దింపి.. షర్మిలను విశాఖ లేదా అనంతపురం ఎంపీగా పోటీ చేయించాలి అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే జరిగితే కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న షర్మిలకు జగన్ షాక్ ఇచ్చినట్లే అవుతుంది.