జగన్ పదవికి గండం.. బాబుని కాపాడాల్సిన అవసరం వచ్చిందా?

 

ప్రస్తుత రాజకీయాలలో ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యర్థి పార్టీ నేతలను భయపెట్టో, బ్రతిమాలో తమ పార్టీలో చేర్చుకొని ప్రత్యర్థి పార్టీని పూర్తిగా ఖాళీ చేయడం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి మాత్రం భిన్నంగా ఉంది. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. దీంతో జగన్ ఆ 23 లో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని టీడీపీని ఖాళీ చేస్తారని భావించారంతా. కానీ జగన్ మాత్రం అలాంటిదేం చేయకపోగా.. ఒకవేళ ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాలని స్పష్టం చేసారు. ఈరోజుల్లో ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెడుతున్నారు. అన్ని కోట్లు ఖర్చుచేసి గెలిచి, మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోయే సాహసం చేయలేరు. దీంతో చంద్రబాబు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే జగన్ వదిలినా బీజేపీ మాత్రం టీడీపీని వదల్లేదు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న బీజేపీ.. ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకునే దిశగా పావులు కదుపుతుంది. అయితే ఈ విషయంలో బాబు & కో ఎంత ఆందోళన చెందుతున్నారో తెలీదు కానీ.. జగన్ మాత్రం బాగా ఆందోళన చెందుతున్నారట. టీడీపీ బ్రతికుండాలని కోరుకుంటున్నారట. మామూలుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని ఖాళీ చేయాలనుకుంటుంది. కానీ జగన్ మాత్రం టీడీపీ బ్రతకాలని, బాబుని కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. 

కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి బలమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు బీజేపీ దృష్టి సౌత్ మీద పడింది. ముఖ్యంగా 2024 నాటికి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏపీలో పావులు కదుపుతుంది. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. మొదట టీడీపీ నేతలను చేర్చుకొని బలపడిన తరువాత వైసీపీని టార్గెట్ చేసే అవకాశముంది. ఎందుకంటే ఏపీలో టీడీపీ ఖాళీ అయితే.. అప్పుడు ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ, వైసీపీ అవుతాయి. అదే జగన్ భయం. టీడీపీకి ఇప్పుడున్న బలం అలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఈజీ అవుతుంది. అలా కాకుండా బీజేపీ బలపడితే జగన్ కి కష్టాలు మొదలైనట్టే. బీజేపీని ఎదిరించలేడు. ఒకవేళ ఎదిరించే సాహసం చేస్తే పరిస్థితి బాబు కంటే దారుణంగా ఉంటుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఒకవేళ జగన్ బీజేపీని ఎదిరిస్తే వాటిని వెలికితీసి జైలుకి పంపినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ బీజేపీ బలపడకూడదని, బాబుని కాపాడుకోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆ అవకాశం ఇచ్చేలా లేదు.

నిజానికి బీజేపీ ఏపీలో బలపడటానికి కొన్ని నెలల ముందు నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా ముందుగా టీడీపీని టార్గెట్ చేసింది. ముఖ్యంగా టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్నవారికి గేలం వేసి దెబ్బ తీసింది. తరువాత మిగతా నేతలను టార్గెట్ చేసింది. కొందరు వ్యాపారాల కోసం, కొందరు భవిష్యత్తు కోసం ఇలా రకరకాల కారణాలతో టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. టీడీపీకి ముందు నుంచి బీసీ, కమ్మ సామాజికవర్గాలు అండ బలంగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు టీడీపీకి దూరం జరిగారు. ఇప్పుడు వారికి బీజేపీ వల వేసింది. అదేవిధంగా పలు జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గ నేతలను కూడా ఆకర్షించే పనిలో బీజేపీ పడింది. ఇలా సామాజిక వర్గాల వారీగా టీడీపీని బలహీనపరుస్తూ తాను బలపడాలనేది బీజేపీ ప్లాన్. బీజేపీ ఒక్కసారి బలపడటం మొదలు పెడితే.. 2024 లో అధికారమే లక్ష్యంగా వైసీపీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే మోడీ తో సహా పలువురు బీజేపీ పెద్దలు ఏపీలో 2024 లో అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నారు. దాన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు. బీజేపీ ఏపీ మీద ఎంత ఫోకస్ పెట్టిందో.

అంటే ఏపీలో టీడీపీ బలహీనపడే కొద్దీ జగన్ కి కష్టాలు మొదలవుతాయి అనమాట. అందుకే జగన్ తన జాగ్రత్తలో తాను ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన బలం హిందూ ఓటు బ్యాంకు. హిందువులు అందరూ గంపగుత్తుగా బీజేపీ వైపు చూడకుండా.. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకవేళ మెజారిటీ హిందువులు బీజేపీ వైపు వెళ్లినా.. తనకి అండగా ఉన్న రెడ్డి సామాజికవర్గం, క్రిస్టియన్ ఓటుబ్యాంకుతో బీజేపీని ఢీ కొట్టాలని చూస్తున్నారట. అందుకే ఇటీవల అధికారుల పదోన్నుతులలో కూడా రెడ్డిలకు, ముఖ్యంగా క్రిస్టియన్లకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి ఏ మాత్రం నచ్చని చర్య. అంటే జగన్ ఒకవైపు బాబుని కాపాడుకోవాలని చూస్తూనే.. మరోవైపు అవసరమైతే బీజేపీతో పోరుకి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారని అర్ధమవుతుంది. మరి జగన్ బీజేపీని ఎదిరించి నిలబడగలరా?. అసలే ప్రత్యర్థుల మీద సీబీఐ, ఈడీ వంటి వాటిని ఉపయోగించి ముప్పు తిప్పలు పెట్టే బీజేపీ.. జగన్ ని మాత్రం వదులుతుందా?. అదే జరిగితే జగన్ సీఎం పదవి మూడునాళ్ళ ముచ్చట అయ్యే ప్రమాదముంది. అది జరగకూడదంటే జగన్ బాబుని కాపాడుకోకతప్పదు. మరి జగన్ ఈ కమల గండం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Related Segment News