సాయంత్రం ప్రగతి భవన్ లో భేటీ కానున్న ఏపీ, తెలంగాణ సీఎంలు

 

నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయటంపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సాయంత్రం హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. వాస్తవానికి ఈ భేటీ మంగళవారం జరగాల్సి ఉంది కానీ, ఒక రోజు ముందే జరుగుతుంది. గోదావరి జలాలను నాగార్జున సాగర్ లోనూ,  శ్రీశైలం జలాశయం లోనూ రోజుకు రెండేసి టీఎంసీల చొప్పున నూట ఇరవై రోజుల పాటు ఎత్తిపోయటంపై ఇద్దరు సీఎంలు ఇప్పటికే అంగీకరించారు. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ తెలియజేశారు.

దుమ్ముగూడెం నుంచి అక్కంపల్లి వరకు నాలుగు టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి అక్కడి నుంచి రెండు పాయలుగా విడదీసి రెండు టీఎంసీలను నాగార్జున సాగర్ లో, మరో రెండు టీఎంసీలను శ్రీశైలంలోకి పంపడంపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ పథకానికి దాదాపు 1.60 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనా అయితే, పోలవరం అంశం కూడా ముఖ్యమంత్రుల మధ్య చర్చకు వచ్చే వీలుంది. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడం, ముంపు ప్రాంతాలను తగ్గించటం వంటి ప్రతిపాదనలను తెలంగాణ తీసుకువస్తే గనుక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రతిపాదించనుంది. తొమ్మిది, పది షెడ్యూల్ లోని సంస్థల విభజనపై ఇప్పటికే సీఎంల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది.

కొందరు అధికారులు అత్యుత్సాహంతో సరైన సమాచారం లేక ఉత్తర్వులను జారీ చేయటం, సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టటం వల్ల కొంత గందరగోళం నెలకొంది. దీనిపై ఇద్దరు సీఎంలు స్పష్టత ఇవ్వనున్నారు, ప్రధానంగా ఆప్మెల్ వంటి సంస్థల విషయంలో ఏకాభిప్రాయాన్ని వెల్లడించే అవకాశముంది. తెలంగాణ, ఏపీలకు సంబంధించి అధికారాల బదలాయింపు, పథకాలు, కార్యక్రమాల అమలుకు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నారు.

రెండు ప్రభుత్వాల స్థాయిలో చర్చల వల్ల సచివాలయ, శాసనసభ భవనాల అప్పగింత జరిగింది. ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల బదలాయింపునకు ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కొత్త ఇసుక విధానం రూపకల్పనలో తెలంగాణ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని నాలుగు వేల మంది పోలీస్ సిబ్బందికి ఏపీలోని పోలీస్ కళాశాలలో శిక్షణ ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణ సీఎం సిఫార్సుల మేరకు ఏడుగురు తెలంగాణవారికి టిటిడి సభ్యత్వ పదవులు దక్కాయి.