జగన్ తిరుమల పర్యటన.. నో మాస్క్, నో డిక్లరేషన్‌

తిరుమల వేంకటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అయితే, జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కానీ, డిక్లరేషన్‌ ఇవ్వకుండానే శ్రీవారి ఆలయంలోకి జగన్‌ ప్రవేశించారు. సంప్రదాయ వస్త్రధారణతో జగన్ నుదుట నామాలు పెట్టుకున్నారు. మొదట బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత గరుడవాహన సేవలో పాల్గొన్నారు. 

 

ఇదిలా ఉంటే జగన్ తిరుమల పర్యటనలో కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం విమర్శలు తావిస్తోంది. ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. మొదటి నుండి మాస్క్ కి దూరంగా ఉంటున్న జగన్.. తిరుమల పర్యటనలోనూ మాస్క్ లేకుండానే కనిపించారు. జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా రేణిగుంట విమానాశ్రానికి వచ్చారు. అక్కడ ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, భూమన కరుణాకర్‌రెడ్డిలు ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఒకరిద్దరు తప్ప జగన్ తో సహా ఎవరూ మాస్క్‌లు పెట్టుకోలేదు. ఇక రేణిగుంట నుంచి నేరుగా జగన్ తిరుమల చేరుకున్నారు. అక్కడ కూడా జగన్ ముఖంపై మాస్క్ కనిపించలేదు. అసలే ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ, తిరుమల పర్యటనలో కూడా సీఎం ముఖంపై మాస్క్ కనిపించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.