సీనియర్లతో జగన్ కు చిక్కులు... నోరు జారడంపై స్ట్రాంగ్ వార్నింగ్ 

 

వైసీపీ ట్రబుల్ షూటర్స్... ట్రబుల్లో పడుతున్నారు. అయితే మౌనంగా ఉంటున్నారు... లేదంటే కాంట్రవర్సియల్ కామెంట్లతో కాకరేపుతూ, అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పరువు తీసేస్తున్నారు. ముఖ్యంగా అధినాయకుడు రాష్ట్రంలో లేనప్పుడు ప్రతిపక్షాల చేతికి ఆయుధాలు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సీనియర్లే... నోరు జారుతూ, ప్రభుత్వానికి లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతున్నారు.

బొత్స సత్యనారాయణ... జగన్ టీమ్ లో కీలక సభ్యుడు... సీనియర్ మంత్రి కూడా... అయితే, సీఎం జగన్ రాష్ట్రంలో లేనప్పుడు రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తేనెతుట్టెను కదిపారు. ప్రభుత్వం విధానపరంగా, కేబినెట్లో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయంపై సొంత వ్యాఖ్యలు చేసి అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. బొత్స వ్యాఖ్యలతో వారం రోజులపాటు రచ్చరచ్చ జరిగింది.

బొత్స వ్యాఖ్యలతో రచ్చ జరుగుతుంటే, చల్లార్చాల్సిన జగన్ రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి... రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోశారు. అమరావతిపై బొత్స వ్యాఖ్యలను సమర్ధిస్తూ మాట్లాడటమే కాకుండా, జగన్ నిర్ణయాలన్నీ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే తీసుకుంటున్నారంటూ నోరు జారారు. విజయసాయి మాటలను మోడీ, అమిత్ షా దృష్టికి బీజేపీ నేతలు తీసుకెళ్లడంతో పీఎంవో సీరియస్ అయ్యింది. వెంటనే విజయసాయిరెడ్డి, ఏపీ చీఫ్ అడ్వైజర్ అజేయ కల్లాంను పిలిపించుకుని వివరణ అడిగింది.

ఇలా అధినేత రాష్ట్రంలో లేని సమయంలో, కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వివాదాలు సృష్టించడంపై, సొంత పార్టీ నేతలే సీరియస్ అవుతున్నారు. జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన నేతలు, ఇలా వివాదాస్పదంగా మాట్లాడంపై మండిపడుతున్నారు. అయితే ఇవన్నీ అధినేత జగన్‌కు తెలిసే జరుగుతున్నాయో, తెలియక జరుగుతున్నాయో తెలియదు కానీ, ఆయా నేతలకు మాత్రం జగన్... స్ట్రాంగ్ క్లాస్ పీకారనే మాట వినిపిస్తోంది.