సలహాలు వినడం జగన్ కి నచ్చట్లేదా....సీరియసయితే ఏమొస్తుంది ?

 

తన పాలనను వందేళ్ళ పాటు గుర్తుంచుకునేలా చేయాలని చూస్తున్న జగన్ రోజుకొక అనూహ్య నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. నిజానికి పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనకు సంబంధించి స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిస్తామని తన పాదయాత్ర సమయంలోను, ఆ తర్వాత వైసీపీ మేనిఫెస్టోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 

అందుకనుగుణంగా ఆయన బిల్లును రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకే ఆ బిల్లును రూపొందించి అధికారులు కేబినెట్ సమావేశానికి తీసుకొచ్చారు. అయితే ఈ బిల్లుపై కార్మిక శాఖ కార్యదర్శిగా ఉన్న ఉదయలక్ష్మి ఇది ఆచరణ సాధ్యంకాదని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పబోయారు. అయితే ఈ మాట విన్న సీఎం ఒక్కసారిగా సీరియస్ అయ్యారట. నిబంధనల వల్ల నేను మీకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయానని నిరుద్యోగులకి తాను చెప్పాలా అని ప్రస్నించారట. 

ఎన్నడూ లేనిది జగన్ అంత సీరియస్ కావడం చూసి ఈ హామీని అమలు చేసేందుకు ఇతర మార్గాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించబోయారట. ఆ మాట విన్న ఆయన ఏమి చేస్తారో తనకు తెలీదని ఎట్టి పరిస్థితుల్లో తాను చెప్పిన ప్రకారం రూపొందించి తీసుకురావాలని సీఎం జగన్ స్పష్టం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అధికారులు బిల్లును అమలు చేయటం సాధ్యంకాదని, కొన్ని పరిశ్రమల్లో నైపుణ్యం ఆధారంగా స్కిల్ వర్కర్లను తీసుకోవాల్సి వస్తుందని, పైగా ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించటం అనేది ఆచరణ సాధ్యంకాదని అంటున్నారు. 

అయినా సలహాలు వినడం నచ్చని జగన్ తాను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తించడం రాబోయే కాలానికి అంత మంచిది కాదేమో ? జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఇటు మంత్రులకు, అటు అధికారులకు మింగుడు పడక, ఏం చెబితే ఎలా రియాక్టవుతారోననే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను పక్కన పెట్టి మరీ జరిపిన క్యాబినెట్ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు అఫీషియల్ గా బయటకు రాకపోయినా మీడియా లీకులలో భాగంగా బయటకి వచ్చి చర్చనీయాంశంగా మారింది.