సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు

 

మంత్రివర్గ ఏర్పాటుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్‌ జగన్‌ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తానంటూ సంచలన ప్రకటన చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి డిప్యూటీ సీఎంలుగా నియమిస్తానని ఈ ఉదయం జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ ప్రకటించారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గం లో మార్పులు ఉంటాయని, అప్పుడు కొత్త మంత్రులు వస్తారని ఆయన అన్నారు. ఈ రెండున్నరేళ్లూ మంత్రుల పనితీరును తాను గమనిస్తుంటానని, సంక్షేమం అమలు, అభివృద్ధిలో నిర్లక్ష్యం చూపిన వారికి పదవులు దూరమవుతాయని హెచ్చరించారు. శనివారం నాడు 25 మంది మంత్రులతో పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటవుతుందని జగన్ స్పష్టం చేశారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.