అప్పుడు బాబుని! ఇప్పుడు పవన్ని! జగన్ సెల్ఫ్ గోల్స్!

పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శల పర్వం ఏపీలో పొలిటికల్ హీట్ రాజేస్తోంది. అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే, తాను పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఎంత రచ్చవుతుందో జగన్ కి తెలియదా? ఖచ్చితంగా తెలిసే మాట్లాడి వుంటాడు. అయితే, పవన్ మాత్రం ఈ విషయంలో కొంత తెలివిగానే స్పందించాడు. మొదట జగన్ని టార్గెట్ చేసింది జనసేన అధినేతే. అయితే, ఆయన తనికి ఎమ్మెల్యేలు వుంటే అసెంబ్లీ వదిలి వెళ్లే వాడ్ని కానని అన్నారు. అది పూర్తిగా రాజకీయ విమర్శ. మరి జగన్ చేసింది ఏమిటి? రాజకీయ జవాబు ఇవ్వకుండా వ్యక్తిగత వెటకారానికి దిగాడు. పవన్ కి నలుగురు పెళ్ళిళ్ళైనా వైసీపీ నాయకుడికొచ్చిన ఇబ్బంది ఏంటి? జనంలో వున్న జగన్ని జనసేనాని విమర్శించకూడదా? ఇదే ఇప్పుడు కాస్తో, కూస్తో ఆలోచించగలిగే వారి మెదళ్లలో మెదులుతోంది!

 

 

జగన్ పవన్ పై వ్యక్తిగత దాడి చేయటంతో జనసేన అధినేత మరో రూటులో రియాక్షన్ ఇచ్చాడు. తన అభిమానులు, కార్యకర్తలు జగన్ని  వ్యక్తిగతంగా విమర్శించొద్దని, అతడి ఇంటి ఆడపడుచుల్ని గొడవలోకి లాగొద్దని విజ్ఞప్తి చేశాడు. దీంతో పవన్ ది నైతికంగా పై చేయి అయింది! మరి ఇప్పుడు జగన్ ఏం చేస్తాడు? పవన్ కి సారీ చెప్పేసి ఈ గొడవని ఇక్కడితో ముగిస్తాడా? జగన్ తత్వం తెలిసిన వారెవరూ అలా ఆశించరు! జగన్ వెనక్కి తగ్గటం అంత తేలిగ్గా జరగదు. కాబట్టి ఎన్నికల వరకూ పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ కనినపిస్తూనే వుండే ఛాన్స్ వుంది!

 

 

ఇక జగన్ కి ఇప్పుడు పవన్ అభిమానులు, కార్యకర్తలు చేసే విమర్ళల కంటే ఎక్కువ నష్టం కాపు సామాజిక వర్గం నుంచి వచ్చేలా వుంది. అది వైసీపీలోని కొందరు నేతల్ని కలవరపెడుతోంది. పవన్ కు అభిమానులు తెలుగు రాష్ట్రాలంతటా వుండవచ్చు. కానీ, ఆయన సామాజిక వర్గం మాత్రం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో వుంది. వారంతా పవన్ కు ఫ్యాన్సా అంటే కాదు. అలాగే వారంతా జనసేన కార్యకర్తలూ కాదు. పోయిన సారీ పెద్ద ఎత్తున టీడీపీకి ఓటు వేసి చంద్రబాబు గెలుపుకి కారణమయ్యారు! ఈ సారి జగన్ సరిగ్గా పావులు కదిపితే ఈయనకూ ఓటు వేసే వారు. కానీ, ఇంతలోనే ఏపీ పాలిటిక్స్ లో కీలకమైన కాపు నేతగా ఎదుగుతోన్న పవన్ ను జగన్ అవసరానికి మించి టార్గెట్ చేశాడు. ఇది మంచి కంటే చెడు ఎక్కువ చేసేలా వుందంటూ తలలు పట్టుకుంటున్నారట వైసీపీ కాపు నేతలు!

 

 

తూర్పూ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ తరుఫున మోహరించి ఎన్నికల బరిలో దిగాలనుకున్న చాలా మంది కాపు నేతలకి పవన్ కళ్యాణ్ ఉదంతం పెద్ద దెబ్బగా మారింది. జగన్ చేసిన విమర్శలు కాపు ఓటర్లలో ఎలా రియాక్షన్ తెస్తాయో అర్థం కావటం లేదు. ఇప్పటికే కాపునాడు లాంటి సంఘం ఘాటుగా స్పందించింది కూడా! జగన్ వ్యాఖ్యలు పవన్ పరిధిని దాటి కులం రంగు పులుముకున్నాయి. అదే వైసీపీకి నష్టం తెచ్చేలా వుంది.

ఎన్నికలు రేపో, మాపో అయితే లేవు కాబట్టి… ఈ దుమారం కొంత కాలానికి చల్లారవచ్చని కూడా భావించవచ్చు. కానీ, జగన్ ఇక ముందు కూడా పవన్, చంద్రబాబు లాంటి వార్ని విమర్శించేటప్పుడు వ్యక్తిగత దాడికి కూడా దూరంగా వుంటే మంచిది. అనవసరంగా చంద్రబాబును చెప్పులతో కొట్టమని, ఉరితీయాలని నోరు జారి ఉప ఎన్నికల్లో ఓటమి కొనితెచ్చుకున్నాడు గతంలోనూ. ఇప్పుడు అలాంటి ఫలితమే పవన్ పై చేసే విమర్శల కారణంగానూ ఎదురు కావచ్చు! సామెత పాతదే అయినా… నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది… నిజమే కదా!