జగన్ కేసులో ప్రధాని మోడీకి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు.. ఇప్పుడు ప్రధాని మోడీని ఇరుకున పెట్టేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇందూ టెక్ జోన్‌లో పెట్టుబడులు పెట్టి తాము నష్టపోయామని పేర్కొంటూ మారిషస్ ప్రభుత్వం.. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందూ టెక్ జోన్ కుంభకోణం కేసులో కాంట్రాక్టర్‌ శ్యాంప్రసాద్ రెడ్డి, వైఎస్ జగన్ తదితరులపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్ ఎల్ఎల్‌సీ కంపెనీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కింద 49 శాతం వాటాలు కలిగి ఉంది. సీబీఐ ఛార్జీషీటుతో ఇందూ టెక్ జోన్ పనులు నిలిచిపోయాయి. ఈ వ్యవహారంతో తాము నష్టపోయామంటూ మారిషస్ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్రమోడీకి నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు కేంద్ర, ఆర్థిక, న్యాయ, వాణిజ్య పన్నులు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పేర్లను కూడా నోటీసులో ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం.