జనసేనతో పొత్తు.. జగన్ నై నై

గత కొంతకాలంగా వైసీపీ, జనసేన పార్టీల మధ్య రహస్య పొత్తు ఉంది.. ఆ రెండు పార్టీలను వెనకుండి బీజేపీ నడిపిస్తోంది అంటూ పలువురు ఆరోపిస్తూ వచ్చారు. ఇక ఈమధ్య వైసీపీ, జనసేనల మధ్య అధికార పొత్తుకు రంగం సిద్దమైందంటూ వార్తలు కూడా వచ్చాయి. మరి వైసీపీతో పొత్తుకు జనసేన సుముఖంగా ఉందో లేదో తెలీదు కాని.. జనసేనతో పొత్తు అంటే మాత్రం వైసీపీ అధినేత జగన్ నై నై అంటున్నారట.

 

 

తనపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తోన్న పవన్‌ కళ్యాణ్‌ తో పొత్తు పెట్టుకోనే ప్రసక్తేలేదని.. ఈ విషయంలో తనతో సంబంధం లేకుండా జనసేనతో చర్చించవద్దని.. జగన్ తన పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారట. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ వల్ల జనసేనకు లాభం కలుగుతుంది కానీ.. జనసేన వల్ల వైసీపీకి అసలు ఏ మాత్రం లాభం ఉండదని జగన్ భావిస్తున్నారట. అందుకే జగన్ ఒకవైపు చంద్రబాబును టార్గెట్‌ చేస్తూనే మరో వైపు పవన్‌ పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగన్‌, పవన్‌ లను కలసి పోటీ చేయించాలని బీజేపీ పావులు కదుపుతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ జగన్ మాత్రం  పవన్‌ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని అంటున్నారట. ఆయన గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం ఆయన కోరిన సీట్లు ఇవ్వలేం.. గత ఎన్నికల పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. పవన్‌కు రాజకీయ లబ్దిని చేకూర్చడం కంటే ఒంటరిగా ముందుకు వెళదాం అని జగన్‌ తేల్చి చెబుతున్నారట.

 

 

ఇటీవల విజయసాయిరెడ్డి పవన్‌తో రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. జగన్‌ ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరిపారా?.. లేదా ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు స్వయంగా కలిశారా?.. అనే విషయం బయటపడడం లేదు. ఏది ఏమైనా పవన్ తో ముందు ముందు మరిన్ని సమస్యలు వస్తాయని వైసీపీ ఆందోళన చెందుతుంది. వైసీపీ ఓటు బ్యాంక్‌ జనసేనకు లభించవచ్చు కానీ జనసేన ఓటు బ్యాంక్‌ వైసీపీకి బదిలీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పవన్‌ ఓటు బ్యాంక్‌ కేవలం కాపు యువజన ఓటర్లేనని.. వారు జనసేన అభ్యర్థికి ఓటు వేస్తారే తప్ప పొత్తు ఉన్నా వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని జగన్‌ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పవన్‌ తో పొత్తు కన్నా.. అప్పటి పరిస్థితులను బట్టి  ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలా? ఎవరినైనా కలుపుకుపోవాలా? అనే విషయంపై చర్చిద్దామని జగన్‌ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏమంటారో తెలీదు కానీ ప్రస్తుతానికైతే జనసేనతో పొత్తు అంటే జగన్ నై నై అంటున్నారట.