సీఎంగా ప్రమాణస్వీకారం.. జగన్ అనే నేను
Published on: Thu May 30, 2019 12:52PM

నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం 12.23 గంటలకు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్‌తో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.
‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.’’ అంటూ జగన్ ప్రమాణంస్వీకారం చేశారు.
ఈకార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. జగన్ తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుమార్తెలు హర్ష, వర్ష, వైసీపీ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వైసీపీ అభిమానులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, వైసీపీ శ్రేణుల సమక్షంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.


