జగన్ ప్లాన్ : ప్రజావేదిక మీద ఫోకస్....ప్రత్యేక హోదా మిస్సయ్యింది !

 

గత మూడు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న ఏకైక న్యూస్ ప్రజావేదిక. మీడియా ఫోకస్ మొత్తం ఆ ప్రజావేదిక కూల్చివేత, దాని మీద ప్రముఖుల స్పందన, పబ్లిక్ టాక్స్ పెడుతూ అదే ఏపీకి జీవన్మరణ సమస్యలాగా కలరింగ్ ఇచ్చింది. దాదపు ప్రజలు కూడా అన్ని విషయాలూ వదిలేసి రెండు వర్గాలుగా విడిపోయి మరీ ఈ విషయాన్ని ఒకరు ఖండిస్తుంటే మరొకరు సమర్దిస్తూ ఇదొక జీవన్మరణ సమస్యలా చేస్తూ వెళ్ళారు. ఏపీ ప్రజల్లో ఇంతగా ఈ విషయం హైలైట్ కావాడానికి కారణం మీడియా అని చెప్పక తప్పదు. అయితే ఈ విషయం మీడియాలో ఇంతగా హైలైట్ కావడానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే అందుకు పలు ఆసక్తికర అంశాలను విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో నూతనంగా పాలనా పగ్గాలు చేపట్టి పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారనే భావన ఏపీ ప్రజల్లో ఎర్పడుతూ వచ్చింది. దానికి కారణం ఆయన బీజేపీ అలాగే తెలంగాణా రాష్ట్రంతో వ్యవహరిస్తున్న వైఖరి అనే చెప్పొచ్చు. నిజానికి అధికారంలోకి వచ్చే ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది కూడా ప్రత్యేక హోదానే. ఎలాగైనా ఏపీకి హోదా సాధించి తీరుతామని కేంద్రంలో ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి మద్దతు ఇస్తామని చెబుతూ వచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తానంటే కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశమే లేదని ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కేవలం వైసీపీ వలనే సాధ్యమని వైకాపా నేతలు ఎన్నికల ముందు గట్టిగా చెప్పారు. 

జనం సైతం వారి మాటల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కానీ గెలిచిన మరునాడే కేంద్రానికి పరిపూర్ణ బలం ఉంది కాబట్టి ఆ విషయంలో గట్టిగా మాట్లాడలేమని జగన్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఇన్ని సీట్లు రాకుండా ఉండాల్సింది అని ఆయన వ్యాఖ్యలు చేశారు . కానీ ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. దాని కోసం ప్రయత్నం చేస్తున్న జగన్ కు కేంద్రం ఝలక్ ఇస్తూ సరిగ్గా నాలుగు రోజుల క్రితమే హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరి వెల్లడించింది. ‘హోదా ఇచ్చేది లేదు’ అని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్‌ అడిగిన ఓ ప్రశ్నకు జగన్ ప్రజావేదిక లో కలెక్టర్ ల సదస్సు ఏర్పాటు చేసిన రోజే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఒడిసా, రాజస్థాన్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచీ ప్రత్యేక హోదా డిమాండ్లు వచ్చాయి. అయితే, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేవని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిజానికి గతంలో ప్రణాళిక సహకారంలో భాగంగా ఆయా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇచ్చేది. కొండ ప్రాంతాలు, తక్కువ జన సాంద్రత, ఎక్కువ గిరిజన జనాభా, పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు, ఆర్థిక, మౌలిక సదుపాయాల వెనుకబాటు, వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హోదా ఇచ్చేవారు. 

కానీ ప్రత్యేక హోదాలో పారిశ్రామిక వృద్ధికి నిర్దిష్ట చర్యలేమీ లేవని ఆమె తన సమాధానంలో వివరించారు. ఈ విషయం మీడియాలోకి రాక ముందే జాగ్రత్త పడిన జగన్ జాగ్రత్త పడ్డారు, వెంటనే ఈ ప్రజావేదికని కూల్చివేస్తున్నామని ఆయన అప్పటికప్పుడు ప్రకటించారు. ఇక అప్పటికే పెద్దగా న్యూస్ లేక కరువులో ఉన్న తెలుగు మీడియాకి ఈ సమస్య పెద్ద బంగారు బాతులా కనపడి ఉండచ్చు, దీంతో వెంటనే పబ్లిక్ పల్స్ లూ, సెలెబ్రిటీ బైట్స్ అంటూ సినిమా కోసం ప్రమోషన్స్ చేసినట్టు ఈ ప్రజావేదిక విషయంలో కాన్సంట్రేట్ చేశారు. అంటే ఒక రకంగా జగన్ చేసిన చిన్న డీవిఏషన్ కి మీడియా పడిపోయింది. మరి తెలిసి అలా చేసిందో తెలియక అలా చేసిందో కానీ మొత్తానికి ఆ విషయాన్ని పక్కన పెట్టేసేలా వ్యవహరించింది.

ఇక ఈ విషయం మీద మాట్లాడిన బీజేపీ నాయకురాలు పురందేశ్వరి  ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి జగన్ పక్కదోవ పట్టించరాదని హితవు పలికారు. నిజానికి ఆయన అప్పటికే పక్క దోవ పట్టించేశారు. ఈవిడకే కాస్త ఆలస్యంగా అర్ధం అయినట్టుంది.