జగన్ వందరోజుల్లో సాధించినదేంటీ..?

టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి.. గతేడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్. నేటితో ఈ యాత్ర 100వ రోజుకు చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మండు టెండలను.. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ధృఢ సంకల్పంతో జగన్ తన యాత్రను సాగిస్తున్నారు. యాత్ర ప్రారంభించిన రెండు మూడు రోజుల్లోనే అనారోగ్య సమస్యలు తలెత్తడం.. ప్రతీ శుక్రవారం కోర్టు వాయిదాలతో జగన్ తన యాత్రను కొనసాగిస్తారా లేక.. మధ్యలోనే వదిలేస్తారా అన్న సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.

 

మొదట్లో కాస్త తడబడినా.. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి రాటుదేలారు. ప్రభుత్వంపైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదా విమర్శలు చేస్తూ యాత్ర సాగించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్న నవరత్నాలను జగన్ జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాను అధికారంలోకి రాగానే.. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్.. అనాథలుగా మిగిలిన వృద్ధుల కోసం మండలానికో వృద్ధాశ్రమం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తో పాటు విద్యార్థులకు హాస్టల్ ఫీజు కోసం మరో రూ.20 వేలు, వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేలు వీలైతే మూడు వేలు పెంచుతానంటూ.. ప్రతిపక్షనేత చేస్తోన్న హామీలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ హామీలు నెరవేర్చాలంటే ఆయన ఆస్తులు అమ్మడంతో పాటు రూ. 5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమంటూ కామెంట్లు పడుతున్నాయి.

 

ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పనిచేస్తానని జగన్ ప్రకటించడం.. ఏపీ ప్రయోజనాలకు దెబ్బ తీస్తోన్న కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాననడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఇక ఇదే సమయంలో తన అక్రమాస్తుల మకిలిని ప్రధాని మోడీకి సైతం ప్రతిపక్షనేత అంటించారు. ఇందూటెక్ వ్యవహారంలో తమకు న్యాయం చేయాల్సిందిగా మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థాన్ని ఆశ్రయించడం.. కోర్టు ఏకంగా ప్రధాని మోడీ కార్యాలయానికి నోటీసులు పంపడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి వందరోజుల పాదయాత్ర జగన్‌కు మిశ్రమ ఫలితాలు ఇచ్చిందని చెప్పవచ్చు.