ఏపీ రాజధానిపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరు వారాల్లో?

 

ఏపీ రాజధాని అమరావతి గురించి గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చకు ప్రధాన కారణం మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలే. ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక సరైన నిర్ణయం కాదని అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి.  ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా? లేదా మారుస్తారా? అంటూ ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలకమైన రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వకుండా మౌనం వహిస్తున్నారు. దీంతో రాజధానిపై అనుమానాలు మరింత ఊపందుకున్నాయి. జగన్ మౌనంగా ఉండటంతో నిజంగానే రాజధానిని మార్చే ఆలోచనలో వైసీపీ సర్కార్ ఉందా అని అమరావతి ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే తాజాగా జగన్ సర్కార్ రాజధాని అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతిపై జగన్ సర్కార్ ఓ కమిటీని నియమించింది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆరు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అయితే గతంలో రాజధాని ఏర్పాటు కోసం శివరామ కృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ, గత ప్రభుత్వం శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోలేదు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం కమిటీ నివేదికను పట్టించుకుంటుందని నమ్మకం ఏంటి?. రాజధానిగా అమరావతి ఎంపిక సరైనదా కాదా అని జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ ఆరు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. ఒకవేళ కమిటీ అమరావతికి ఓటేస్తే జగన్ ఓకే అంటారా? లేదు అమరావతి ఎంపిక సరికాదంటే.. అమరావతి ప్రాంత రైతులు, ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా జగన్ రాజధానిని మార్చే సాహసం చేస్తారా?. అసలు ఈ కమిటీ కాలయాపన కోసమా? లేక కమిటీ నివేదికను బట్టి జగన్ నిజంగానే నిర్ణయం తీసుకుంటారా?. వీటికి సమాధానాలు తెలియాలంటే ఆరు వారాలు వేచి చూడాల్సిందే. కనీసం కమిటీ నివేదిక వచ్చిన తరువాతైనా సీఎం జగన్ రాజధాని అంశంపై మౌనం వీడాలని కోరుకుందాం.