సీఎంగా జగన్ తొలి ప్రసంగం అద్భుతం.. విజయమ్మ కంటతడి

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జగన్‌ ప్రసంగించారు.

"ఆకాశమంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3,648 కి.మీ పాదయాత్ర చేశా. పాదయాత్రలో పేదల కష్టాలు చూశా.. ప్రజల కష్టాలు విన్నాను. నేనున్నానని మీ అందరికి చెబుతున్నాను. అందరి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రజల కష్టాలను తీర్చేందుకు రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. గత ప్రబుత్వాల మాదిరిగా పేజీల కొద్ది మేనిఫెస్టో తీసుకోలేదు. మా మేనిఫెస్టోలో కులానికో పేజీ తీసుకురాలేదు. మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తాను. మేనిఫెస్టో ఆధారంగా పరిపాలిస్తానని మాట ఇస్తున్నాను" అని జగన్ చెప్పారు.

"ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో వాలంటీర్లుగా నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగవకాశం కల్పిస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తాం. గ్రామాలలో చదువుకున్న పిల్లలు.. సేవా చేయాలన్న ఆరాటం ఉన్న వారిని రూ.5వేల వేతనంతో వాలంటీరుగా నియమిస్తాం. ప్రభుత్వ పథకాల్లో అవీనితి పారదోలేందుకు వాలంటీర్లను నియమిస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చే వరకూ పనిచేయవచ్చు. ప్రభుత్వ సేవలు ఎవరికి అందకపోయినా, లంచాలు కనిపించినా కాల్‌ సెంటర్‌ ద్వారా నేరుగా సీఎం ఆఫీసుకు ఫిర్యాదు చేయవచ్చు. సీఎం ఆఫీసు నంబరు మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లో పరిష్కరిస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తాం. నవరత్నాల్లో ప్రతి ఒక్కటి తప్పకుండా అమలు చేస్తాం." అని జగన్ స్పష్టం చేసారు.

"ఏపీ సీఎంగా ఆరుకోట్ల ప్రజలకు హామీ ఇస్తున్నా. స్వచ్ఛమైన, అవినీతిలేని పాలన అందిస్తా. అవినీతి ఎక్కడ జరిగిందో .. ఏ ఏ కాంట్రాక్టుల్లో అవినీతి చోటుచేసుకుందో వాటిని రద్దు చేస్తాం. నిబంధనలు మార్చి ఎక్కువ మంది కాంట్రాక్టు పనుల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తాం. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది. వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. కాంట్రాక్టులన్నీ పారదర్శకంగా ఉండేలా చూస్తాం. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అనుమతితో జ్యుడిషియల్‌ కమిషన్‌ వేస్తాం. కమిషన్‌ సూచనలకు అనుగుణంగా కాంట్రాక్టులు అప్పగిస్తాం. ఏడాది సమయం ఇస్తే అవినీతి లేకుండా అంతా ప్రక్షాళన చేస్తా. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని మాట ఇస్తున్నా. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆశీర్వదించిన దేవుడికి, నాన్నగారికి, నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను’’ అంటూ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రసంగం అనంతరం జగన్ తన తల్లి విజయమ్మని కౌగిలించుకున్నారు. భావోద్వేగంతో ఆమె కంటతడిపెట్టేశారు. ఆమె కన్నీరు తుడిచిన జగన్ స్టేజ్‌పై నుంచి కిందికి తీసుకెళ్లారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన స్వగృహానికి చేరుకున్నారు.