కోడి కత్తి దాడి తర్వాత జగన్ తొలి బహిరంగ సభ

 

వైసీపీ అధినేత జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన దాడి ఘటన తర్వాత తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్.. పార్వతీపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయని విమర్శించారు. ఈ నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని జగన్ నిలదీశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు తోటపల్లి ప్రాజెక్టు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనిని కూడా చంద్రబాబు నాలుగున్నర ఏళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.

ప్రభుత్వ సంస్థల్ని శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తారని ధ్వజమెత్తారు. పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బాగా దోపిడీలకు పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్ వాడీ పోస్టులను కూడా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా వదిలిపెట్టడం లేదని జగన్ ఎద్దేవా చేశారు. పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువగా ఉన్నారని, అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు కాజేస్తున్నారని జగన్ ఆరోపించారు. జిల్లాలో 26 కరవు మండలాలుంటే వాటిలో 4 మండలాల్లో మాత్రమే కరవు ఉందని చంద్రబాబు అంటున్నారని అన్నారు. రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయైనా కరీఫ్, రబీ రైతులకు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండి ఏం గడ్డి తింటున్నారని వ్యాఖ్యానించారు. పునాదులు మాత్రమే కట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లు చంద్రబాబు చెబుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

అదేవిధంగా తనపై జరిగిన దాడి గురించి కూడా జగన్ స్పందించారు. అన్యాయమైన పాలనను ప్రశ్నించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హత్యాయత్నం చేసింది తన అభిమానంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమాని తనపై ఎందుకు హత్యాయత్నం చేస్తాడని ప్రశ్నించారు. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్ చంద్రబాబుకు సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. దాడి జరిగిన గంటకే స్క్రిప్ట్ ప్లే చేశారని, చంద్రబాబు స్క్రిప్ట్‌ను డీజీపీ చదివారని జగన్ ఆరోపించారు.ఫ్లెక్సీలో విజయమ్మ ఫొటో లేదని, గరుడపక్షి ఫొటో ఉందన్నారు. దాడి జరిగిన సమయంలో నిందితుడి దగ్గర ఎలాంటి లెటర్ కనబడలేని జగన్ చెప్పారు. లెటర్ ఇస్త్రీ చేసినట్లు ఉందని, మడతలు కూడా లేవన్నారు.  తాను విశాఖలో అడుగు పెట్టినప్పుడే సీసీ కెమెరాలు ఆగిపోయానని తెలిపారు. తెలిసీ తెలీకుండా అభాండాలు వేయకూడదనే హత్యాయత్నంపై తాను వెంటనే స్పందించలేదనన్నారు. అప్పటికప్పుడు చొక్కా మార్చుకుని బయల్దేరానని చెప్పారు. ఎవ్వరూ కంగారుపడొద్దని ట్వీట్ చేశానని జగన్ స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టులో తనపై హత్యాయత్నం, కుట్ర చేయకపోతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. కుట్రలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వుతున్నారని విమర్శించారు. సీబీఐ విచారణ జరిగితే నేరుగా జైలుకి వెళ్తారని చంద్రబాబు వణికిపోతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.