కొత్త హామీ.. ఏపీకి 25 జిల్లాలు!!

 

వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం సమీపంలోని లొద్దపుట్టి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్‌ మాట్లాడుతూ.. 'ఇడుపుల పాయ నుంచి మొదలైన యాత్రలో అనేక అనుభవాలు ఎదురయ్యాయి. నా పాదయాత్రలో రైతులు ఎలా వలసలు పోతున్నారో కళ్లారా చూశాను' అన్నారు. 'అనంతపురంలో శివయ్య అనే రైతు కరవు వల్ల పంట నష్టపోయినట్లు వాపోయాడు. చంద్రబాబు అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు కరవు గురించి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కరవు వచ్చిందని చెబితే అధికారులను దూషించినట్లు రైతు శివయ్య చెప్పాడు' అని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనతో పాటు కరవు కూడా వస్తుందని రైతులు చెబుతున్నారు అని ఎద్దేవా చేసారు. బాబు పాలనలో ఓ వైపు కరవు, మరోవైపు తుఫానులు అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతుల అప్పులు పెరిగాయని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ పెద్ద మోసమని, రైతులు కష్టాల్లో ఉంటే జాతీయ రాజకీయాలంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ద్వజమెత్తారు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదని ఆరోపించారు. చంద్రబాబు పాలన చూస్తుంటే ఆందోళన కలుగుతోందని, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో 650 వాగ్ధానాలు పెట్టి మోసం చేశారని జగన్ విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తే పరిపాలన మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు. జిల్లాలలో కలెక్టర్ వ్యవస్థను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పరిధిలో ఏడు నియోజవకర్గాలు మాత్రమే ఉండేలా చూస్తానన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో అయితే కలెక్టర్ అద్భుతమైన పాలన అందిస్తారని తెలిపారు.  వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీని 25 జిల్లాలుగా విభజిస్తానని పరిపాలనను ప్రతీ ఒక్కరికీ అందిస్తానన్నారు.