TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కి ఆ నరం తెగలేదా? తండ్రిని చూసి నేర్చుకోలేరా..

Published on: Sat May 22, 2021 2:51PM

అనుభవం కొన్ని పాఠాలు నేర్పుతుంది. కొందరు నేర్చుకుంటారు, కొందరు నేర్చుకోరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఒక సందర్భంలో తన మెదడులో ఉన్న కోపం నరం తెగిపోయింది అన్నారు. ఎదురు దెబ్బలు, మొట్టికాయలు  తినీతినీ తల బొప్పికట్టి, తలలో ఉన్న కోపం నరం తెగిపోయిందని వైఎస్ అన్నారు. వైఎస్సార్’ని  చివరి రోజుల్లో చూసిన వారికి అయన పంచకట్టు, ఆ చిరునవ్వు అలా గుర్తుండి పోయాయి. కానీ, ఆయన  మొదటి నుంచి శాంత మూర్తి కాదు. రాజకీయాలలో ఎదుగుతున్న దశలో  ఆయనను  ఫ్యాక్షనిస్ట్ ముద్ర  వెంటాడింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడిపిన నిత్య అసంతృప్తి వాదిగా ముద్ర వేసుకున్నారు. సీనియర్ నాయకులకు అయన పొడకూడా గిట్టేది కాదు. అయితే, కాలగమనంలో, ముఖ్యంగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక తీర్చుకునేదుకు చివరి ప్రయత్నంగా పాదయాత్ర  చేసిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. తన కోపమే తన శత్రువు’ అనే విషయం అర్థం అయిందో ఏమో,అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తలలోని కోపం నరం తెంచేసుకున్నారు. చివరి వరకు అదే ఇమేజ్’తో అదే చిరునవ్వుతో, శాంత మూర్తిగా వెళ్లి పోయారు. ఒక సందర్భంలో, (బహుశా 2009 ఎన్నికల సందర్భంగా కావచ్చు) ఆయన ప్రత్యర్ధి నేత, చంద్రబాబు నాయుడు వంద రోజుల్లో వైఎస్’ ను ఇడుపల పాయలో కూర్చోపెడతా అని చేసిన ప్రతిజ్ఞ పై, రియాక్షన్ అడిగితే, ఓ చిరునవ్వుతో సరిపెట్టారు. 

ఇప్పడు ఇదంతా ఎందుకంటే, ఆయన రక్తం పంచుకు పుట్టిన కుమారుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడ కూడా ఆ లక్షణాలు కనిపించడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు వరసపెట్టి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, ఆయనలో మార్పు రావడం లేదు సరికదా, పగ ప్రతీకారాలను మరింతగా పెంచుకుంటూ పోతున్నారనిపించేలాఆయన వ్యవహార సరళి నిర్ణయాలు ఉంటున్నాయని, ఎవరో కాదు సొంత  మనుషులే అంటున్నారు. పగ ప్రతీకారంతో రగిలిపోయే వారికి, వేరే శత్రువులు అవసరం ఉండరు ... స్వహస్తాలతో ఎవరి గోతిని వారే తవ్వుకుంటారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, అది నిజమే అనిపిస్తోంది. సొంత  పార్టీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు విషయంలో ఏమి జరిగిందో, చూశాం. సలహాదారులను నమ్ముకుని, తప్పులో కాలేశారు. చిక్కుల్లో ఇరుకున్నారు. పగ ప్రతీకారంతో రగిలిపోయే వారికి, శత్రువులు అవసరం ఉండరు అనే నానుడిని నిజం చేశారు. 

ఒక్క రఘురామ రాజు విషయంలోనే కాదు, ఒక్క సారి గతంలోకి వెళ్లి చూస్తే, వైసీపే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం అంతటా తెలుగు దేశం కార్యకర్తలపై దాడులు జరిగాయి. అదే క్రమంలో  అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రాసాద రావును అనేక విధాల వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ వేధింపులు, అవమానాలు భరించలేకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు దేశం పార్టీ అప్పట్లో ఆరోపించాయి. నిజానిజాలు ఎలా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమత్రి అయిన తర్వాత కోడెల వేధింపులకు గురయ్యారు, అది మాత్రం నిజం. 

ఇక శుక్రవారం, గుండెపోటుతో కన్ను మూసిన, ‘పిచ్చోడు’ డాక్టర్ సుధాకర్, ఉదంతం అయితే చెప్పనే అక్కర లేదు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు, మాస్కులు ఇవ్వండి మహాప్రభో అని వేడుకున్నందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేయాలి, అలాగే, సుధాకర్’ను సస్పెండ్ చేసేందుకు ఏదో ఒక కారణం చూపాలి కాబట్టి, ఆయనకు పిచ్చోడు ముద్ర వేశారన్న ఆరోపణలున్నాయి. ఒక డాక్టర్’  ను ఎలా చూడ కూడదో, ఎలా అవమానించ కూడదో అలా అవమానించారు విశాఖ పోలీసులు. గత సంవత్సరం అక్కయ్య పాలెం వద్ద, విశాఖ పోలీసులు, ఆయన్నిఎంతలా చిత్రహింసలకు గురిచేశారో, తెలుగు ప్రజలంతా చూశారు. బట్టలు ఉడదీసి, పెడరెక్కలు విరిచి కట్టి, అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టటం అందరూ ..చూశారు. బహిరంగంగా అంత హింసించిన పోలీసులు లోపల ఇంకేతగా చిత్ర హింసలకు గురి చేశారో ఏమో, ఆయన  చేయని తప్పును ఒప్పుకుని, చివరకు పిచ్చోడిగా పిచ్చి చావుచచ్చారు. 

ఇటీవల కాలంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయిడు,  పార్టీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి ధూళిపాళ నరేంద్ర ఇతర నాయకులను అరెస్ట్ చేయించి, అవమానాలపాలు చేస్తున్నతీరు, అలాగే, పరిపాలన సంబధంగాను, రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి, నిమ్మగడ్డ రమేష్’ తో వ్యవహరించిన తీరు, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక విషయాల్లో అనవసర వివాదాలకు పోయి అక్షింతలు వేయించుకున్న తీరు  చూసినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ నుంచి నేర్చుకోవలసిన పాఠం మాత్రమే కాదు స్వీయ అనుభవాల నుంచి నేర్చుకోవలసిన పాఠాలునేర్చుకోలేదనిపిస్తోందని అంటున్నారు... ఇద్దరినీ దగ్గరగా చూసిన సీనియర్ పాత్రికేయులు.