కొత్తవారికి స్వాగతం.. పాతవారికి న్యాయం.. జగన్ రాజకీయం అమోఘం

కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుక పోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటిది కృష్ణాజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. నిజానికి రాజకీయ చైతన్యానికి మారుపేరు కృష్ణా జిల్లా అని అంటూ ఉంటారు. కానీ అక్కడ రాజకీయంగా ఎప్పుడూ ఏదో ఒక కలకలం జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు గన్నవరం నియోజకవర్గం వార్తల్లో నిలిచింది.

2019 ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశారు. ఆయనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి వీరిద్దరూ ఒకనాడు మంచి స్నేహితులు అయినప్పటికీ రాజకీయాల్లో ఇరువురి మధ్య వైరం పెరిగింది. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చొరవ చూపడంతో ఎట్టకేలకు వీరిరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ మోహన్ టిడిపికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన వాట్సప్ లో పంపించిన లేఖ ఆ తర్వాత చేసిన వ్యతిరేక వ్యాఖ్యల పై టిడిపి హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ తన పై టిడిపి సస్పెండ్ వేటు వేయడానికి ముందే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారని తెలుసుకున్న గన్నవరం పార్టీ శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావు నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వెంకటరావుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి బాలశౌరిలు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయనను జగన్ తో కూడా మాట్లాడించారు. వంశీని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ యార్లగడ్డ వెంకట్రావును వదులుకునేందుకు మాత్రం ససేమిరా ఇష్టపడలేదు. ప్రస్తుతానికి వంశీ శాసన సభలో తటస్థ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు. అవసరమైనపుడు ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గన్నవరం నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలా లేదా అనేది నిర్ణయం తీసుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది.

ఇదిలా వుంటే జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తవారొచ్చినా పాతవారిని వదులుకోకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానంగా కనిపిస్తుంది. తను ఇచ్చిన మాట ప్రకారం యార్లగడ్డ వెంకట్రావుని వెంటనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా జగన్ నియమించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఘన చరిత్రే ఉంది. ఇలాంటి బ్యాంకు చైర్మన్ గా నియామకం కావడం వెంకట్రావు కూడా సంతృప్తినిచ్చింది. ఆయనకు పదవి ఇవ్వడంతో పాటు వల్లభనేని వంశీకి కూడా ఎలాంటి తలనొప్పి లేకుండా జగన్ లైన్ క్లియర్ చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారు. అలాగే గన్నవరం నియోజక వర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా న్యాయం చేశారని వారు చెప్పుకుంటున్నారు.

ఇక పెడన లోనూ ఇదే విధానాన్ని సీఎం జగన్ అనుసరించారు. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పార్టీ టిక్కెట్ ని ఆశించి భంగపడిన ఉప్పాల రాంప్రసాద్ కి కూడా సంతృప్తి కలిగేలా వ్యవహరించారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని రాంప్రసాద్ కు కట్టబెట్టారు. నిజానికి పెడనకు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన జోగి రమేష్ కు చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పట్లో రాంప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎంపీ బాలశౌరి రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించారు. అధికారం లోకొచ్చిన తర్వాత రాంప్రసాద్ కు న్యాయం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని ఉప్పాల రాంప్రసాద్ కు ఇచ్చారు. దీంతో జోగి రమేష్ కి కూడా పెడన నియోజకవర్గంలో పార్టీ పరంగా తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికి సీఎం జగన్ న్యాయం చేయడంతో పాటు పార్టీలోకి రావాలనుకునే వల్లభనేని వంశీ వంటి ఎమ్మెల్యేలకు మార్గం సుగమం చేస్తున్నారు. ఈ పరిణామం పై పార్టీ కేడర్ లో కూడా ఎటువంటి సందిగ్ధం లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. మరి ఆ వ్యూహాలు మున్ముందు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.