దుబారా ఖర్చులు వద్దు.. మంచిగా పనిచేస్తే సత్కారాలు

 

మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తొలి సారిగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన సీఎం పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో మాకు ప్రభుత్వాన్ని అప్పగించారని, మన పాలనలో వైవిధ్యం ఉండాలని, మార్పు కనిపించాలని కోరారు. అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినప్పుడే ప్రభుత్వం, ప్రజల కలలు నెరవేరుతాయని చెప్పారు. "ఉత్తమ పాలన అందించాలన్నది నా ఆశయం. అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాను. నా ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి. మీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ అనుభవాన్ని మంచి ఫలితాలు సాధించేందుకు వినియోగిస్తారని ఆశిస్తున్నా" అన్నారు. అవినీతిని నిర్మూలించాలని, ప్రభుత్వ వ్యయంలో దుబారాను అరికట్టి నిధులు ఆదా చేయాలని కోరారు. మంచి ఫలితాలు సాధించిన అధికారులను సత్కరించి గౌరవించనున్నట్లు వెల్లడించారు.

సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ... సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏపీలో అత్యంత ప్రతిభావంతులైన అధికారులు ఉన్నారని అన్నారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొని ఉత్తమ పనితీరును కనబర్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.