పోలవరం పనులపై సీఎం జగన్ అసంతృప్తి!!

 

ఏపీ సీఎంగా వైఎస్ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ కాపర్‌ డ్యాం పనులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం.. కాఫర్‌డ్యామ్‌కు సంబంధించి ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తారు. కాఫర్‌ డ్యామ్‌ పనులు ఎంత వరకు పూర్తయ్యాయి? భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటి? ఇది కొట్టుకు పోకుండా తీసుకున్న రక్షణ చర్యలు ఏమిటి? గోదావరిలో వరద వస్తుందని తెలిసి కూడా సీజన్‌ ముగిశాక ఎలా నిర్మాణం చేపట్టారని అధికారులను ప్రశ్నించారు. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా నీరు స్పిల్‌వేపైకి వచ్చి నిర్మాణాలకు ఆటంకం కలిగితే ఎలా అని సందేహం వ్యక్తం చేశారు. ఇలా సీఎం వరుస ప్రశ్నలు అడగగా.. కొన్నింటికి సమాధానం చెప్పిన అధికారులు.. కొన్నింటికి మాత్రం తడబడినట్లు తెలిసింది. ముందుచూపు లేకుండా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు చేపట్టడంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసారని సమాచారం.