ఎస్పీ బాలుకు భారతరత్న ప్రకటించండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ఇవ్వాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాశారు. బాలసుబ్రమణ్యంకు అత్యున్నత పురస్కారం ప్రకటించడం ద్వారా తగిన నివాళి అర్పించాలని కోరారు.

 

లేఖలో ఆయన పలు భాషల్లో పాడిన పాటలు, ఆయనకు వచ్చిన అవార్డుల విషయాలను జగన్ ప్రస్తావించారు. "గత 50 ఏళ్లుగా ఆయన ప్రపంచ సంగీత పరిశ్రమపై చూపిన ప్రభావం, ఆయన అందుకున్న ప్రజాదరణ అపారం. ఆయన తన మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులు, ఆరుసార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 నంది అవార్డులతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక అవార్డులు పొందారు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేన్ జోషి వంటి సంగీత దిగ్గజాలకు భారతరత్న ప్రకటించింది. ఐదు దశాబ్ధాల పాటు సంగీతం, కళా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపుతూ, విశేష సేవలందించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కూడా భారతరత్న ప్రకటించి ఆయనకు నివాళి అర్పించాలి." అంటూ సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు.