జగన్ ఢిల్లీ టూర్...కాకా పట్టేందుకేనా ?

 

ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌చ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈరోజు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయ‌న స‌మావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఆయ‌న వారితో చ‌ర్చించ‌నున్నారని అంటున్నారు. ఎన్నికల నాడు బాగానే ఉన్న జగన్ బీజీపీలు ఇప్పుడు కొంచెం ఎడముఖం పెడ ముఖంగా ఉంటున్నాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలకు కేంద్రం మోకాల‌డ్డుతోంది.

జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను కేంద్రం వ్య‌తిరేకిస్తోంది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. ఈక్రమంలో జగన్ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలతో పాటు పీపీఏలపై సమీక్ష, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాలపై వారితో చర్చించనున్నారు.

ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హోం మంత్రి అమిత్‌ షాతో, సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. రేపు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, 11.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు.

చంద్ర‌బాబు హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, వాటిని బ‌య‌ట‌పెట్టాల‌ని జ‌గ‌న్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గానూ జ‌గన్ గుర్తించిన అస్త్రాలు పీపీఏ, పోల‌వం టెండ‌ర్లు. ఈ రెండింటిలో ఎక్కువ అవినీతికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పాల్ప‌డింద‌ని, పీపీఏల‌ను పున‌స‌మీక్షించి, పోల‌వ‌రం రివ‌ర్స్ టెండరింగ్‌కు వెళ్ల‌డం ద్వారా చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాలని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

కానీ, కేంద్రం జ‌గ‌న్‌ను అడ్డుకుంటోంది. పీపీఏల‌పై పున‌స‌మీక్ష వ‌ద్ద‌ని కేంద్రం జ‌గ‌న్‌కు ఉత్త‌రాల మీద ఉత్త‌రాలు రాస్తోంది. ఈ విష‌యాన్ని న‌రేంద్ర మోడీ తిరుప‌తి వచ్చిన‌ప్పుడు జ‌గ‌న్ ఆయ‌న దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. అలాగే పోల‌వరంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. స్వ‌యంగా పార్ల‌మెంటులో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్ప‌డం వైసీపీకి మింగుడు ప‌డ‌టం లేదు.

అయినా వెన‌క‌డుగు వేయ‌ని జ‌గ‌న్ తాను నియ‌మించిన నిపుణుల క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు పోల‌వ‌రం కాంట్రాక్ట‌రు న‌వ‌యుగ‌ను త‌ప్పించారు. ఈ నిర్ణ‌యాన్ని కూడా కేంద్రం త‌ప్పుప‌ట్టింది. ఈ క్రమంలో ఈ విషయాలన్నీ వారితో చర్చించేందుకే ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నారు మరి ఏమేరకు ఈ విషయాలలో జగన్ కేంద్రాన్ని ప్రభావితం చేస్తారో వేచి చూడాలి మరి.