ప్రమాణస్వీకారానికి ముందే మోదీ, జగన్ ల భేటీ.. కీలక చర్చలు?

 

ఏపీ ఎన్నిక‌ల్లో ఘన విజ‌యం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఈనెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అయితే జగన్ త‌న ప్ర‌మాణ స్వీకారానికి ముందే ఢిల్లీ వెళ్లి.. రెండోసారి ప్ర‌ధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న మోదీతో స‌మావేశం అవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జ‌గ‌న్‌కు మోదీ అభినంద‌న‌లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ స్వ‌యంగా ఢిల్లీ వెళ్లి మోదీని క‌లిసి.. ఆయ‌న స‌హ‌కారం కోరాల‌ని డిసైడ్ అయ్యారు.

ఏపీలో ప్ర‌స్తుతం పాల‌నా ప‌రంగా జ‌గ‌న్ ముందున్న స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలంటే కేంద్ర సహకారం త‌ప్ప‌ని స‌రి. కేంద్రంతో స‌న్నిహితంగా ఉంటూ నిధులు సాధించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో మోదీతో ముందుగానే స‌మావేశం కావాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ నెల 26 లేదా 27న జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

ఏపీకీ ప్ర‌త్యేక హోదా, పోల‌వరం పూర్తి చేయ‌టం, రాజ‌ధాని నిర్మాణం జ‌గ‌న్ ముందున్న అతి పెద్ద స‌వాళ్లు. అదే విధంగా జ‌గ‌న్ వ‌స్తే ఏపీకి పెట్టుబ‌డులు రావన్న చంద్ర‌బాబు ఆరోపణలను.. జ‌గ‌న్ ఆచ‌ర‌ణ రూపంలో త‌ప్ప‌ని నిరూపించాలి. ఇవన్నీ జరగాలంటే మోదీ మ‌ద్ద‌తు చాలా అవ‌స‌రం. మోదీతో స‌ఖ్య‌త‌గా ఉంటూనే సాధించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మోదీ సైతం జ‌గ‌న్ ప‌ట్ల సానుకూలంగానే ఉన్నార‌ని.. ఏపీకి సాయం విష‌యంలో త‌మ పైన జ‌రిగిన ప్ర‌చారం తప్పని నిరూపించుకోవడానికి మోదీ సిద్ధంగా ఉన్నారని స‌మాచారం.

మోదీ, జగన్ ల మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఎన్డీయేలో వైసీపీ చేర‌టం, కేంద్ర కేబినెట్‌లో చేర‌టం, ఏపీలో బిజేపీ ఎమ్మెల్సీల‌కు మంత్రి ప‌ద‌వులు వంటి విష‌యాల పైన చ‌ర్చ జ‌రిగి.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.