జగన్ కు మరో పదిమంది ఎం.ఎల్.ఎ.ల మద్దతు?
Published on: Thu May 31, 2012 12:17PM
తాము తలచుకుంటే నాయకులకు కొదవే లేదని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్మోహన రెడ్డి అన్న మాటలు నిజమని ఆయన్ను సిబీఐ అరెస్టు చేశాక తెలుస్తోంది. ఇటీవల విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు స్వయంగా జగన్ ను కలిసి పార్టీలో చేరతానని ప్రకటించారు. అన్నట్టుగా తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు. ఈయన వెనుకే నడిచేందుకు పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వదిలి జగన్ పార్టీలో చేరతారని జగన్ తో అనుభంధమున్న ఎంపీ సబ్బం హరి ప్రకటించారు. అలానే తెలుగుదేశంపార్టీలోని పలువురు నాయకులను జగన్ స్వయంగా ఆహ్వానించారు. దీని పర్యవసానంగానే ఇటీవల మాజీ రాజ్యసభ సభ్యుడు మైసూరా రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పార్టీ నుంచి కూడా ఐదుగురికి తగ్గకుండా తమ పార్టీలో చేరతారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్, టిడిపిల నుంచి మొత్తం పదిమంది వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చునన్న వార్తలు అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశంపార్టీలను కలవరపరుస్తున్నాయి.


