సెల్ఫ్ గోల్స్‌తో ‘కాపు’రం చేస్తోన్న జగన్!

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్ చేసిన కాపు రిజర్వేషన్ వ్యాఖ్యలే హాట్ టాపిక్ అయ్యాయి! గత ఎన్నికల ముందు నుంచీ కాపులకు బీసీ హోదా అనేది పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతూ వస్తోంది. జనంలో వున్న ఆకాంక్ష చూసి మన నేతలు సై అన్నారు. కానీ, ఇప్పుడు అది కోర్టులకి, కేంద్రానికి సంబంధించిన వివాదంగా మారిపోయింది. అయితే, ఇప్పటి వరకూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మరే ఇతర పార్టీ కూడా కాపులకి రిజర్వేషన్స్ పై నో చెప్పలేదు. ఎందుకంటే, అది పొలిటికల్ గా అంత తెలివైన మాట కాదు. కాపులకి నిజంగా బీసీ స్టేటస్ ఇవ్వటం వీలవుతుందా లేదా అనేది పక్కన పెడితే… నా వల్ల కాదని మాత్రం ఏ నాయకుడు కూడా చెప్పలేదు. ఆ ఘనకార్యం మన జగన్ బాబే చేశారు!

 

 

జగన్ వైఎస్ బొమ్మ పెట్టుకుని ఏపీకి ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు కానీ… అసలు ఆయనలో ఒక్కోసారి ఆశ్చర్యం కలిగించే మనిషి బయటకొస్తాడు. సగటు పొలిటీషన్ ఎవరూ చేయని చారిత్రక తప్పులు ఆయన చేస్తుంటారు. వాటి వెనుక ఏదో పెద్ద చాణక్యం వుందని ఆయన మీడియా, టీడీపీ అంటే పడని వారు, చంద్రబాబు ప్రత్యర్థులు భాష్యాలు చెప్పొచ్చుగాని…. ఫైనల్ వాటికి ఎలాంటి వాల్యూ వుండదు. జగన్ సెల్ఫ్ గోల్స్ గా హిస్టరీలో మిగిలిపోతుంటాయి. కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన తాజా కామెంట్ అలాంటి ఒకానొక అన్ వాంటెడ్ సెల్ఫ్ గోలే! జగన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా నవ్యాంధ్రాలో తన ప్రస్థానం మొదలు పెట్టాక అసెంబ్లీని బహిష్కరించి అతి పెద్ద తప్పు చేశాడు. ఇక మొన్నటికి మొన్న కీలకమైన సమయంలో పార్లమెంట్ ను కూడా వదిలి వచ్చేయమని తన ఎంపీలకు చెప్పి మరో బ్లండర్ చేశాడు. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ సంగతి నా చేతిలో లేదు కేంద్రం చూసుకోవాలి అంటూ మ్యాచ్ ను మూడు , సున్నా గోల్స్ గా మార్చేశాడు! టీడీపీకి, చంద్రబాబుకి తన సెల్ఫ్ గోల్స్ తోనే జగన్ పాయింట్లు పెంచుతున్నాడు. ఆపార అనుభవం వున్న చంద్రబాబు తన చాణక్యంతో ఈ పాయింట్లతో ఈజీగా మ్యాచ్ గెలిచే పరిస్థితి వచ్చేస్తోంది!

 

 

ఇంతకీ, కాపులకి బీసీ స్టేటస్ పై నేనేమీ హామీ ఇవ్వను అని కుండబద్ధలు కొట్టి జగన్ ఏం సాధించాడు? ఏమీ లేదు! కుండ బద్దలై మట్టి పెంకులు గుచ్చుకునే స్థితి వచ్చింది! దట్సాల్! అసలు కొందరి అభిప్రాయం ప్రకారం జగన్ ఇలా మాట్లాడటానికి కారణం… అంతకు ముందు ఆయన పవన్ పై చేసిన పర్సనల్ వ్యాఖ్యలే! పవన్ పెళ్లిళ్ల గురించి అనవసరంగా నోరు రచ్చ చేసుకున్న వైసీపీ అధినేత ఈ కాపు కామెంట్ల ద్వారా జనం దృష్టిని మరల్చగలిగాడు. అయితే, ఇది కూడా నెగటివ్ గానే పని చేసింది. పవన్ ని తిట్టాడన్న ఆగ్రహంతో వున్న కాపు సోదరులు ఇప్పుడు తమ రిజర్వేషన్ ఆకాంక్షపై జగన్ నీళ్లు చల్లడం జీర్ణించుకోలేకపోతున్నారు. ముద్రగడ లాంటి వారు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఎలా చూసినా కాపు ఓటు బ్యాంక్ కి జగనే స్వయంగా చిల్లు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది...

 

 

జగన్ కాపు రిజన్వేషన్లపై తేల్చేశారు. దీని వల్ల టీడీపీకి ఎంత లాభమో కానీ పవన్ కు కాపు ఓట్లు మళ్లే ప్రమాదమూ వుంది. మరి ఈ విషయం తెలుసుకోలేనంత అమాయకుడా జగన్? చెప్పలేం… బాగా తెలివైన వాడే అయితే ఇప్పుడు ఏ అవసరం లేకున్నా కాపు రిజర్వేషన్ల సమస్యని రాజేసి ఎందుకు చలి కాచుకుంటాడు! జగన్ లాజిక్ జగన్నాథుడికే తెలియాలి!