TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ కేసులో సిబిఐ కి షాక్

Published on: Mon May 21, 2012 6:33PM

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ కేసులో సిబిఐ కి షాక్ తగిలింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ చేస్తున్న విచారణ కీలక ఘట్టానికి చేరుకోవడం తెలిసిందే. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతూ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ సంబంధిత రహస్య ఉత్తర్వులను జారీచేసింది. వీటి ఆధారంగా సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. జననీ ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ఆస్తుల జప్తునకు సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది.



 

సిబిఐ పిటిషన్‌లో ఎనిమిది లోపాలున్నాయని సిటీ సివిల్ కోర్టు తెలిపింది. ఆస్తులకు సంబంధించి సరైన కారణాలు వివరించలేదని కోర్టు తెలిపింది. సాక్షి మీడియాకు సంబంధించి హైదరాబాదు వెలుపల కూడా ఆస్తులున్నాయని, అందువల్ల ఇది తమ పరిధిలోకి ఎలా వస్తుందో చెప్పలేదని, ఇది తమ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది. ఆస్తుల వివరాలను కాగితాల మీదనే ఇచ్చారని, డాక్యుమెంట్లను ఇవ్వలేదని కోర్టు చెప్పింది. సాక్షి మీడియా దాఖలు చేసిన కెవియట్ పిటిషన్‌ను కూడా సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. ఇది కూడా తమ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది.