లక్ష్మినారాయణపై విరుచుకుపడ్డ జగన్ వర్గం
Published on: Tue Jan 24, 2012 3:47PM
హైద
రాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసును విచారిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్ర రావు దుమ్మెత్తిపోశారు. వైయస్ జగన్‌ను ఇబ్బంది పెడుతున్న లక్ష్మినారాయణకు మంత్రి పదవి ఇస్తారేమోనని వారు మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు సిబిఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయరామారావుకు మంత్రి పదవి దక్కిందని వారు గుర్తు చేశారు. పత్రికల పొగడ్తలకు లక్ష్మినారాయణ మురిసిపోతున్నారని వారు వ్యాఖ్యానించారు.లక్ష్మినారాయణ నిజాయితీపరుడు కారని వారు అభిప్రాయపడ్డారు. కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా లక్ష్మినారాయణ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. నిజమైన దోషులను లక్ష్మినారాయణ పట్టించుకోవడం లేదని, అమాయకులను వేధిస్తున్నాడని వారన్నారు. జగన్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తే రాష్ట్ర ప్రజలు లక్ష్మీనారాయణను క్షమించబోరని వారు హెచ్చరించారు. సిబిఐ వైయస్ జగన్ కుటుంబాన్ని వేధిస్తోందని వారు ఆరోపించారు.


