జగన్ కేబినెట్ లో 8 మంది ఖరారు.. కృష్ణా నుండి ఇద్దరు

 

వైఎస్ జగన్ టీం రెడీ అవుతుంది. ఇప్పటికే స్పీకర్ గా తమ్మినేని సీతారాంను, మంత్రులుగా పలువురిని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు విజయసాయిరెడ్డి వారికి ఫోన్ చేసి మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.

జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్పారని సమాచారం. బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొడాలి నాని, కొలుసు పార్థసారధి లను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని.. రేపు మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీ కావాలని చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తం 25మంది ఉండే ఏపీ కేబినెట్ లో ఇప్పటికి 8మందికి విజయసాయిరెడ్డి ఫోన్ చేసి మంత్రులుగా ఖాయం చేశారు. మిగతావారు ఎవరా అని చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి వస్తుందా లేదా అన్న ఆసక్తి పొలిటికల్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆమెకు ఇంకా ఫోన్ రానట్టు సమాచారం. అదేవిధంగా ధర్మాన కృష్ణ దాస్ సోదరుడు అయిన ధర్మాన ప్రసాద్ రావుకు మంత్రిగా అవకాశం లేనట్టే కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి కృష్ణదాస్ ను తీసుకోవడంతో ప్రసాద్ రావు పరిస్థితి ఏంటన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

ఖరారైన మంత్రుల పేర్లు ఇవే:

ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు) 
బొత్స సత్యనారాయణ (విజయనగరం)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
మేకతోటి సుచరిత (గుంటూరు)
మేకపాటి గౌతంరెడ్డి (నెల్లూరు)
కొడాలి నాని (కృష్ణా జిల్లా)
కొలుసు పార్థసారధి ( కృష్ణా జిల్లా)