జగన్ కేసులోనూ..శ్రీలక్ష్మి, రాజగోపాల్
Published on: Wed Feb 15, 2012 9:18AM
హైదరా
బాద్: జగన్ అక్రమాస్తుల కేసులోనూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనులశాఖ మాజీ అధికారి రాజగోపాల్‌ను విచారించడానికి అనుమతించాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. జగన్ కేసుకు సంబంధించి చేస్తున్న దర్యాప్తులో భాగంగా అనేక ఫైళ్లను పరిశీలించామని, వాటన్నింటినీ అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి, గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్న రాజగోపాల్ ప్రాసెస్ చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో వారిద్దరినీ విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు సీబీఐ ఎస్పీ వెంకటేశ్ మంగళవారం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓబుళాపురం గనుల వ్యవహారంలో అరెస్టయి, ప్రసుత్తం జైల్లో ఉన్న శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను అక్కడే విచారించేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. కాగా, పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. జగన్ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి జారీ చేసిన తొమ్మిది జీవోలపై దృష్టి సారించారు.
వాస్తవానికి ఈ జీవోలు జారీ కావడంలో కీలకమైన నోట్‌ఫైల్‌ను నాటి గనులశాఖ మంత్రి సబిత ఆమోదించడం గమనార్హం. వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడుల పెట్టిన కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి, రాజగోపాల్ ద్వారా చర్యలు తీసుకున్నారనే అనుమానంపై సిబిఐ వారి విచారణకు అనుమతిని కోరినట్లు తెలుస్తోంది. దాల్మియా సిమెంట్స్, అన్‌రాక్ సంస్థలకు గనుల లీజుపై సిబిఐ అధికారులు వారిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాము స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా వారిద్దరిని విచారించడం ద్వారా రాబట్టే సమాచారం ఆధారంగా జగన్ ఆస్తుల కేసులో పురోగతి సాధించవచ్చునని సిబిఐ అనుకుంటున్నట్లు సమాచారం. కాగా, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ప్రభుత్వాధికారి బాలకృష్ణను సిబిఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పెన్నా సిమెంట్స్ వ్యవహారాలపై సిబిఐ అధికారులు బాలకృష్ణను విచారించినట్లు తెలుస్తోంది.
అక్రమాల ఐఏఎస్ శ్రీలక్ష్మిపై చార్జిషీటు నమోదులో మరింత ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి 'గ్రీన్ సిగ్నల్' రాకపోవడమే దీనికి కారణం. ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది. శ్రీలక్ష్మి పాత్ర, ఆమెపై అభియోగాలతో అదనపు చార్జిషీటు దాఖలు చేస్తామని సీబీఐ రెండు నెలల క్రితం కోర్టుకు తెలిపింది. కానీ... ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. కేంద్రం నుంచి అనుమతి రానందునే ఇందులో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయ సాయిరెడ్డి రిమాండ్‌ను సీబీఐ కోర్టు వారం రోజులు పొడిగించింది.


