ఎన్నికల సంఘంపై జగన్ ట్వీట్: ద్వంద్వ వైఖరి అంటూ విపక్షాల విమర్శ.!
Published on: Sat Sep 26, 2026 11:05AM

ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశంపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు ఆయన ద్వంద్వ వైఖరికీ, ద్వైదీ భావానికీ అద్దం పట్టాయి. ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.
జగన్ మొదటి నుంచీ ఇదే వైఖరి అవలంబిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ సందర్భంలోనూ ఆ పార్టీ నేతలు వ్యతిరేకించలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల సంఘానికి సంబంధించి చట్ట సవరణ చేయాలంటూ జగన్ చేసిన ట్వీట్ పై బీజేపీయేతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
ఇదే విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎత్తి చూపుతూ జగన్ ను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో అన్ని విషయాలలోనూ అనుకూలంగా వ్యవహరిస్తూ.. బయట మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు కనిపించే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. జగన్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.

జగన్ చేసిన ట్వీట్ కు ఏ ఒక్క రాజకీయ పార్టీ నుంచీ కూడా సానుకూల స్పందన రాకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం విషయంలో ఏ డిమాండ్ అయితే చేస్తున్నాయో అదే డిమాండ్ జగన్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జగన్ ట్వీట్ ను స్వాగతించడానికి ఏ పార్టీ ముందుకు రావడంలేదు. దీంతో జాతీయ రాజకీయాలలో జగన్ స్థానం ఏమిటి? ఎక్కడ అన్న ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి.
జాతీయ స్థాయిలో జగన్ అసలు ఏ పొలిటికల్ కూటమి వైపు ఉన్నారు. ఆయనను కలుపుకుని పోవడానికి ఏ కూటమి సిద్ధంగా ఉందన్న ప్రశ్నలకు.. తాజాగా జగన్ ఎన్నికల సంఘం విషయంలో చట్టసవరణ అంటూ చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను బట్టి జాతీయ స్థాయిలో జగన్ ఏకాకి అని విస్పష్టంగా అర్థమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు కేంద్రంపై విమర్శలు చేస్తూ.. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు నిలిచిన విషయాలను నెటిజనులు గుర్తు చేస్తూ జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నారు.
[YS Jagan, Election Commission Controversy, Mahua Moitra, National Politics, YCP chief tweet, Political Support, Double Standards, Telugu One]


