జగన్ నేత పై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు
Published on: Thu Feb 2, 2012 10:00AM
కడప: వైయస్ జగన్మోహన్ రెడ్డి బంధువు, ఆ పార్టీ నాయకుడు వైయస్ కొండా రెడ్డిపై కడప జిల్లాకు చెందిన పులివెందుల పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. ఈ విషయాన్ని పులివెందుల ఇంచార్జ్ ఎస్ఐ రామచంద్ర మీడియాకు తెలిపారు. ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు చక్రాయపేట మండలం సిద్దారెడ్డిగారిపల్లెలో పోలింగ్ బూత్ దగ్గర కొండా రెడ్డి రెండు పార్టీలను రెచ్చగొట్టి ఘర్షణకు కారణమయ్యారని ఆయన అన్నారు. సిబిఐకి వ్యతిరేకంగా నాగులగుట్టుపల్లిలో కొండా రెడ్డి ధర్నా చేశారు. పలువురు కూలీలపై దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు సూచించినప్పటికీ లెక్క చేయకపోవడంతో రౌడీషీట్ తెరిచామని ఇంచార్జ్ ఎస్ఐ చెప్పారు. కాగా గతంలో వైయస్ జగన్, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తమ ఎంపీ, ఎమ్మెల్యే సభ్యత్వాలతో పాటు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఉప ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే.


