జగన్ కు ఆస్తులు ప్రకటించే దమ్ముందా బొత్స సవాల్
Published on: Wed Jan 25, 2012 4:21PM
నల్లగొండ:
వైయస్ జగన్ కు దమ్ముంటే దోపిడీ చేయలేదని ఒప్పుకుంటూ ఆస్తులు ప్రకటించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఆస్తులు ఎలా వచ్చాయో జగన్ వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. ప్రజల సానుభూతి కోసమే జగన్ మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడాకు బయలుదేరుతూ ఆయన చౌటుప్పల్‌లో బుధవారంనాడు మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర పరిస్థితులను తాను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన చెప్పారు.


