విజయ సాయి రెడ్డికి జడ్జి చివాట్లు
Published on: Wed Jan 4, 2012 1:01PM
హైదరాబా
ద్:వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరెస్టైన జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయి రెడ్డిని ప్రభుత్వ ఉద్యోగిగా సిబిఐ పేర్కొనడంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్కార్ట్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. మీ రక్షణ బాధ్యత వారిదేనన్నారు.మీకు ప్రాణహాని జరిగితే ఎస్కార్ట్‌కు ఇబ్బందులుంటాయని సూచించారు. విజయసాయి రెడ్డి రిమాండ్కు సంబంధించి సిబిఐ సమర్పించిన నివేదికపై నాంపల్లి సిబిఐ కోర్టులో ఇరువర్గాలు వాదనలు వినిపించారు. సిబిఐ ప్రస్తావించిన అంశాలపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయనే ప్రథమ ముద్దాయి అన్నారు. వైయస్ సివిల్ సర్వెంట్ అని, ఇంకా ఎవరి పేర్లు కావాలన్నారు.
కాగా మంగళవారం కూడా సిబిఐ న్యాయమూర్తి విజయ సాయి రెడ్డిని హెచ్చరించారు. సాయిరెడ్డిని కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభించారు. ఈ సమయంలో అనేక సందర్భాల్లో సాయి రెడ్డి జోక్యం చేసుకొని తన వాదన తానే వినిపించే ప్రయత్నం చేశారు.తనను వీడియో కాన్ఫరెన్సు ద్వారా కాకుండా కోర్టుకు హాజరవడం ద్వారా విచారణ చేయాలని అభ్యర్థించారు. తనపై సిబిఐ చేసిన ఆరోపణలన్నీ అబద్దమని, పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించవన్నారు. దీనిపై సిబిఐ న్యాయవాది ఘాటుగా స్పందిస్తూ సిబిఐ చట్ట ప్రకారమే వెళుతోందని, సిబిఐపై ఆరోపణలు చేస్తున్న మీరు, మీ న్యాయవాది కలిసి సొంతగా చట్టాలు తయారు చేసుకోండని సూచించారు. ఓ సమయంలో సాయిరెడ్డిని ఉద్దేశించి మనకు ఎంత ఆత్రుత ఉండాలో అంతే ఉండాలన్నారు. దాంతో సాయిరెడ్డి వెనక్కి తగ్గారు.ఇదిలా ఉండగా, సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ నివేదికలో విజయసాయి రెడ్డిని కీలక వ్యక్తిగా పొల్చడం ఆయన వ్యక్తిగత స్వేచ్ఛని హరించడమేనని ఆయన తరపు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. సాయిరెడ్డిని వేధించడానికే సిబిఐ 14 రోజుల కస్టడీ అడుగుతోందని ఆయన అన్నారు.


