గవర్నర్ వద్దకు వెళ్లనున్న జగన్ ఎమ్మెల్యేలు
Published on: Fri Dec 23, 2011 2:24PM
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు ఈ నెల 26వ తేదిన గవర్నర్ నరసింహన్‌ను కలిసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసం ఓటింగ్ సమయంలో వారు పార్టీ విప్ బేఖాతరు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. విప్ దాఖలు చేసిన వారికి స్పీకర్ ఇటీవలె నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో వారు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. తమకు వచ్చిన నోటీసులపై మూకుమ్మడి వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.


