జగన్ వర్గం ఎంపీకి షాక్ స్పీకర్ నోటీసులు
Published on: Mon Dec 19, 2011 3:42PM
హై
దరాబాద్: వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి లోకసభ స్పీకర్ మీరా కుమార్ నోటీసు జారీ చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఆమె సోమవారం ఈ నోటీసును జారీ చేశారు. పదవికి రాజీనామా చేయడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. మంగళవారం మేకపాటి స్పీకర్ మీరాకుమార్ ఎదుట రాజీనామా నిర్ణయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది. కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదిలావుండగా రాష్ట్రంలో అధికారం పార్టీ కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ విప్ స్పీకర్ నాదెండ్లను కోరారు. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ వర్గంలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై త్వరత్వరగా నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.


