మే 28న జగన్ ను అరెస్ట్ చేస్తారా?
Published on: Thu May 17, 2012 10:29AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంట్ సభ్యులు జగన్మోహనరెడ్డి అరెస్టుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. అక్రమాస్తుల కేసు విషయమై మే 28 వ తేదీన విచారణకు రావలసిందిగా సిబీఐ కోర్టు జగన్ కు సమన్లు పంపింది. జగన్ కోర్టుకు హాజరైన వెంటనే ఆయనను విచారించడానికి అనుమతించవలసిందిగా సిబీఐ అధికారులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేసి వుండటం వల్ల జగన్ ను అరెస్టు చేయవలసిందిగా పోలీసులను కోర్టు ఆదేశించే అవకాశం కూడా వున్నట్టు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మే 28వ తేదీ ఏమవుతుంది? జగన్ అరెస్ట్ అవుతారా? లేదా? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వివిధ సంస్థలకు, వ్యక్తులకు అక్రమంగా మేలుచేకూర్చడం వల్లనే జగన్ కు అక్రమాస్తులు సమకూరినట్లు సిబీఐ పలు ఆధారాలతో ఎఫ్.ఐ.ఆర్.లను దాఖలు చేసింది. కోనేరు ప్రసాద్, మాట్రిక్స్ సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వారిని ఇప్పటికే అరెస్టు చేయడం, మరికొంతమందిని సాక్షులుగా మార్చి వారినుంచి న్యాయమూర్తి సమక్షంలోనే సాక్ష్యాలను నమోదు చేసింది. ఈ స్థితిలో జగన్ కోర్టుకు హాజరైన సమయంలో జగన్ ను తమ కస్టడీకి లేదా విచారణకు అనుమతించవలసిందిగా సిబీఐ కోర్టుకు విన్నవించుకునే అవకాశం వుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎంతటి ఆసక్తి కలిగిస్తున్నాయో ... జగన్ కు సమన్లు జారీచేయడం, ఆయన 28వ తేదీన కోర్టుకు హాజరు కావడం అనే అంశం కూడా అంతే ఆసక్తిని కలిగిస్తోంది.


