రాజకీయాల్లోకి భారతి? కీడెంచి మేలెంచుతున్న జగన్‌..!

 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి మరో ఛరిష్మాటిక్‌ లేడీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి భార్య వైఎస్‌ భారతి... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. భారతికి పెద్దగా ఆసక్తి లేకపోయినా, పార్టీ అవసరాల దృష్ట్యా రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైఎస్‌ ఫ్యామిలీ నుంచి జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలలు... 2014 ఎన్నికల ప్రచారంలో కీ రోల్‌ పోషించడమే కాకుండా, విజయమ్మ స్వయంగా వైజాగ్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. దాంతో విజయమ్మ ఇంటికే పరిమితమైపోయారు, ఇక షర్మిల అయితే మీడియాకి కనిపించడమే మానేశారు. అయితే ఇప్పుడు సడన్‌గా భారతి పేరు తెర మీదకి రావడానికి చాలా కథే ఉందంటున్నారు.

 

వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లే ఛాన్సుందని వైసీపీ అధిష్టానం భావిస్తోందట, జగన్‌‌ను ఎలాగైనా జైలు పంపించాలని తెలుగుదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కేంద్రంపైనా ఒత్తిడి తీసుకొస్తుందని వైసీపీ అనుమానిస్తోంది. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే పార్టీని ఎవరు లీడ్‌ చేయాలన్న చర్చ జరిగిందట, అయితే విజయమ్మ, షర్మిల సమర్ధత మీద పెద్దగా నమ్మకం లేని జగన్‌... భారతిని రంగంలోకి దించాలని డిసైడ్‌ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది. ముందుజాగ్రత్తగా భారతిని రంగంలోకి దించడమే కాకుండా ఇప్పట్నుంచే పొలిటికల్‌గా ట్రైనప్‌ చేయాలని  భావిస్తున్నారట.

 

ఇప్పటికే సాక్షి పత్రికను, సాక్షి టీవీని సమర్ధవంతంగా నడిస్తున్న భారతి... పార్టీని కూడా అంతే సమర్ధంగా నడిపించగలదని జగన్‌ నమ్ముతున్నట్లు పార్టీ సీనియర్ల టాక్‌. ఆ నమ్మకంతోనే జగన్‌... భారతిని రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఒకవేళ పరిస్థితులు తారుమారై.... మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే భారతి ప్రచార బాధ్యతలు తీసుకుంటుందని,  పార్టీని ముందుండి నడిపిస్తుందని తన సన్నిహితులను జగన్‌ చెప్పారట. షర్మిలను భారతికి తోడుగా మాత్రమే ఉపయోగించుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.