TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల కొండపై వైఎస్ అవినాష్ అనుచరుడి వీరంగం!

Published on: Fri Nov 29, 2024 1:12PM

అధికారం కోల్పోయిన తరువాత కూడా వైసీపీయుల అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విషయంలో వారు తగ్గేదేలే అన్నట్లుగా తమ అరాచకత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రక్షాళన తిరుమల నుంచే ఆరంభించాలని సంకల్పించిన చంద్రబాబునాయుడు తిరుమలలో పవిత్రత, భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నారు. అన్న ప్రసాదం నాణ్యత పెంచడంతో పాటు అదనంగా మరో అధరవు చేర్చారు. కొండపై పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. భక్తుల సౌకర్యాలు మెరుగయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిర్దుష్ట సమయాలలో ప్రసాదాల వితరణ, జల ప్రసాద వితరణ పునరుద్ధరించారు. అయితే భక్తుల ముసుగులో తిరుమల కొండపైకి వచ్చిన వైసీపీయుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తిరుమల నిబంధనలను వైసీపీయులు యథేచ్ఛగా, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి నుంచి మొదలు పెడితే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, నారాయణ స్వామి.. ఇలా  వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత  కూడా కొండపై అరాచకంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతల జాబితా కొండవీటి చాంతాడు కంటే పొడవుగానే ఉంటుంది.

తాజాగా వైసీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీనాథ్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన శ్రీవారి దర్శనం కోసం గురువారం (నవంబర్ 28) కొండపైకి వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపలే ప్రైవేటు ఫొటో గ్రాఫర్లతో ఫొటో షూట్ చేయించుకున్నారు. తిరుమల నిబంధనలను ఇసుమంతైనా పాటించకుండా ఆయన నిర్వహించి ఫొటో షూట్ కు అభ్యంతరం చెప్పిన వారిపైనా, ఆ దృశ్యాలను చిత్రీకరించిన విలేకరులపైనా దాడికి పాల్పడినంత పని చేశారు.

నా ఇష్టం ఫోటో షూట్ చేసుకుంటా.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ వీరంగం చేశారు. వంశీనాథ్ రెడ్డి తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కొండపై విజిలెన్స్ అధికారులు ఉన్నారా? ఉంటే ఇంత అరాచకం జరుగుతుంటే వారేం చేస్తున్నారని నిలదీస్తున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వంశీనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.