TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడిని కాల్చి చంపిన దుండగులు

Published on: Wed May 27, 2026 9:12AM

దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా  మారింది. నగరంలో గన్ కల్చర్ రోజురోజుకూ మితిమీరిపోతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈశాన్య ఢిల్లీ పరిధిలో మరోసారి తుపాకీ మోత మోగింది. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ( మే 26)   ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో  రాజా మేవతి అనే 23 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.  పోలీసుల కథనం ప్రకారం ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే 23 ఏళ్ల యువకుడిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.  సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఢిల్లీలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఇలాంటి  ఘటన ఇది రెండోది కావడం గమనార్హం. ఈ నెల 24న రోహిణి జిల్లాలోని బేగంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్న జైన్ నగర్‌లో ఓ శుభకార్యం జరుగుతుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ప్రమాదంలో రాజా (21) అనే మరో యువకుడి కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుసగా జరుగుతున్న ఈ కాల్పుల ఘటనలు ఢిల్లీలో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.