TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్‌ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులను చంపేశాడు..

Published on: Mon Apr 14, 2025 2:26PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని హత్య చేసి ఉక్రేయిన్ పారిపోవడానికి ప్లాన్ చేసిన యూస్ యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ట్రంప్‌ని హత్య చేయడానికి తల్లదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆ 17 ఏళ్ల యువకుడు వారినే హత్య చేయడంతో అసలు కుట్ర వెలుగు చూసింది.  తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో ఓ 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు గత నెల అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో తెలిసిన వాస్తవాలు చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆ యువకుడు.. అందుకు డబ్బులు ఇవ్వట్లేదనే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఫెడరల్‌ వారెంట్‌లో పేర్కొన్నారు. 

విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తమ నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కొన్ని వారాల పాటు మృతదేహాల పక్కనే నివసించాడు. ఆ తర్వాత 14వేల డాలర్ల నగదు, పాస్‌పోర్ట్‌ ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

అతడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత నెల కాన్సస్‌లో నిందితుడు నికిటాను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్లు తెలిసింది. అంతేకాదు.. అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు అతడు కుట్ర పన్నినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడంతోనే వారిని నిందితుడు హత్య చేసినట్లు తెలిసింది. వారిని చంపేసిన తర్వాత ఆ యువకుడు ఓ డ్రోన్‌, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడట. ఓ రష్యా వ్యక్తితో కలిసి ఈ ప్లాన్‌ వేసినట్లు సమాచారం. టిక్‌టాక్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌లలో ఇతడు సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ట్రంప్‌ను చంపి ఉక్రెయిన్‌ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.