మనలోనే ప్రపంచం

ధర్మరాజు ఓసారి ప్రపంచయాత్రకు బయల్దేరాడట. తిరిగివచ్చిన తర్వాత ప్రపంచలోని మనుషుల స్వభావం ఎలా ఉంది అని ఎవరో అడిగారట. ‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత మంచి కనిపిస్తోంది,’ అన్నాడట ధర్మరాజు. అదే సమయంలో దుర్యోధనుడు కూడా ప్రపంచయాత్ర నుంచి తిరిగివచ్చాడట. ప్రపంచంలోని మనుషులు స్వభావం ఎలా ఉంది? అని దుర్యోధనుని అడిగితే... ‘ ఈ ప్రపంచంలో అంతా క్రూరులూ, దుర్మార్గులే కనపిస్తున్నారు,’ అన్నాడట దుర్యోధనుడు. మన దృక్పథం ఎలా ఉంటే ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది అని ఈ కథతో తేలిపోతోంది కదా! ఇలాంటి కథే ఒకటి జపాన్ జనపదంలో ప్రచారంలో ఉంది. కాకపోతే అది కాస్త సరదాగా ఉంటుంది. ఇంతకీ ఆ కథేమిటంటే...


అనగనగా జపాన్లో ఓ మారుమూల గ్రామం. ఆ ఊరిలో ఓ భవనం. ఆ భవనంలోని పెద్ద హాలులో ఎటుచూసినా అద్దాలే కనిపిస్తాయట. అలా పది కాదు వంద కాదు, హాలు అంతా వేయి అద్దాలతో నింపేశాడట ఆ భవన యజమాని. ఆ అద్దాలగదిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారు. ఆ వేయి అద్దాలలో కనిపించే తమ వేయి ప్రతిబింబాలను చూసుకుని మురుసుకునేవారు.


క్రమంగా జపాన్ అంతా, అద్దాల హాలు గురించిన వార్త పాకిపోయింది. ఆ వార్త విన్న ఓ కుక్కపిల్ల ఎలాగైనా ఆ గదిని చూడాలని అనుకుంది. ఉరుకులుపరుగులు తీస్తూ ఎలాగొలా ఆ గ్రామానికి చేరుకుంది. సందు చూసుకుని నిదానంగా ఆ అద్దాలగదిలోకి చొరబడింది. గదిలోకి చూడగానే తనలాగే వందలాది కుక్కలు కనిపించాయి. తను తోక ఊపితే అవికూడా సంతోషంగా తోక ఊపాయి. తను నవ్వితే అవి కూడా నవ్వాయి. తను చేయి చాపితే అవి కూడా తనవైపు చేయి చాపాయి. మొత్తానికి కుక్కపిల్లకు ఆ గది భలే నచ్చేసింది. ‘ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో! మళ్లీమళ్లీ ఇక్కడకు వస్తూ ఉండాలి,’ అనుకున్నది.


కుక్కపిల్ల వెళ్లి తన నేస్తాలన్నింటితోనూ అద్దాలగది గురించి చాలా గొప్పగా చెప్పింది. జీవితంలో ఒక్కసారైనా అందులోకి ప్రవేశించాల్సిందే అంది. ఆ మాటలు విన్న మరో కుక్కపిల్ల అద్దాలగదిని చూసేందుకు బయల్దేరింది. కానీ అందులో ఏముంటుందో అన్న భయంతో, అక్కడ తనకు కనిపించే కుక్కపిల్లలు తనతో ఎలా ప్రవర్తిస్తాయో అన్న అనుమానంతో అడుగులో అడుగు వేసుకుంటూ అద్దాలగదిలోకి చేరుకుంది. అక్కడ దానికి కనిపించిన ప్రతిరూపాలు కూడా భయంభయంగా అనుమానంగా చూస్తూ కనిపించాయి. భయంతో తను మూలిగితే అవి కూడా మూలిగాయి. అనుమానంతో అరిస్తే, అవి కూడా అరిచాయి. ‘అయ్యాబాబోయ్! ఈ ప్రదేశం చాలా ప్రమాదకరంగా ఉంది. మళ్లీ ఇంకెప్పుడూ ఇక్కడకు రాకూడదు,’ అనుకుంటూ తోకముడుచుకుని పారిపోయింది. ఈ కుక్కపిల్లల కథలో కనిపించే నీతి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా!!!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.