TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉస్మానియా హాస్పిటల్‌లో యువ డాక్టర్ ఆత్మహత్య

Published on: Thu Apr 16, 2026 3:44PM

 

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సురేష్ అనే యువ వైద్యుడు హాస్టల్ గదిలో మృతిచెందిన స్థితిలో కనిపించడంతో వైద్య వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మారుమూల గ్రామానికి చెందిన సురేష్ కష్టపడి ఎంబీబీఎస్ సీట్ సాధించి, ప్రస్తుతం పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద డాక్టర్‌గా ఎదిగి తన గ్రామానికి సేవ చేయాలన్నది అతని లక్ష్యం. అయితే ఏమి జరిగిందో తెలియని పరిస్థితుల్లో అతను ఈ దారుణ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

సమాచారం ప్రకారం, సురేష్ జనరల్ సర్జరీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ సీటు రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని తోటి డాక్టర్లు చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్‌ను సహచరులు గుర్తించి వెంటనే చికిత్సకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇదిలా ఉండగా, సురేష్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపి తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సురేష్ తమ గ్రామం నుంచి వైద్య విద్యలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పీజీ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.