TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రతీరోజూ అర్ధరాత్రి 10కె ర‌న్‌.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..

Published on: Mon Mar 21, 2022 3:30PM

అర్థ‌రాత్రి అయిందంటే హాయిగా నిద్ర పోయేవాళ్లే ఎక్కువ మంది. కొంద‌రు ఆవారాగాళ్లు అయితే, మిడ్‌నైట్ రోడ్ల మీద బైక్ రేసింగులు.. తాగి తందానాలాడ‌టాలు చేస్తుంటారు. కానీ, నోయిడాకి చెందిన 19 ఏళ్ల ప్ర‌దీప్ మెహ్రా అనే యువ‌కుడు మాత్రం.. ప్ర‌తీరోజు అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు.. భుజానికి బ్యాగ్ వేసుకొని.. రోడ్డు మీద ప‌రిగెడుతూ ఉంటాడు. డైలీ అలానే చేస్తుంటాడు. లేటెస్ట్‌గా అలా ప‌రుగు పెడుతున్న కుర్రాడు.. కారులో వెళ్తున్న‌ బాలీవుడ్ డైరెక్ట‌ర్ వినోద్ కాప్రి కంట ప‌డ్డాడు. అంతే, ఓవ‌ర్‌నైట్ ఆ యువ‌కుడి 10కె ర‌న్ గురించి యావ‌త్ దేశానికి తెలిసిపోయింది. అత‌ను ఎందుకు అలా రోజూ ప‌రుగెత్తుతున్నాడో తెలిసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అత‌ని క‌ష్టాలు, అత‌ని కృషి, ప‌ట్టుద‌ల చూసి.. నెటిజ‌న్లు సెల్యూట్ చేస్తున్నారు. అంత ఇన్‌స్పైరింగ్‌గా ఉంది ప్ర‌దీప్ మెహ్రా స్టోరీ....

పేదరికానికి తల వంచలేదు  ఆ యువకుడు. తల్లి హాస్పిటల్ లో ఉన్నా కుంగిపోలేదు. అన్నతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. రోజంతా నోయిడాలో మెక్ డొనాల్డ్స్ స్టోర్ లో పని చేస్తున్నాడు. రాత్రి పరిగెత్తుకుంటూ.. 10 కిలో మీటర్ల దూరంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. అతను ఎందుకలా పరుగెత్తుతున్నాడనేది నేటి యువతకి స్పూర్తి కలిగించేలా ఉంది.

ద‌ర్శ‌కుడు వినోద్ కాప్రి ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అర్థ‌రాత్రి రోడ్డుపై ప‌రిగెత్తుతున్న యువ‌కుడిని చూసి లిఫ్ట్ ఇస్తానంటాడు ఆ డైరెక్ట‌ర్‌. అయితే, ఆ యువకుడు తనకు లిఫ్ట్‌ వద్దని, రోజూ ఇలాగే పరిగెడుతానని చెప్పాడు. ఆ ద‌ర్శ‌కుడు మ‌రింత ఇంట్రెస్ట్‌తో మ‌రిన్ని వివ‌రాలు అడుగుతుంటాడు.. ప్ర‌దీప్ చెప్పిన ఆన్స‌ర్స్ విని ఆశ్చ‌ర్య‌పోతాడు. డైరెక్ట‌ర్ వినోద్ పోస్ట్ చేసిన వీడియోలో వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ ఇలా సాగుతుంది....

వినోద్‌:  ఓ బాబు ఎక్కడికెళ్లాలి.. నేను డ్రాప్‌ చేస్తాను రా?  

ప్రదీప్‌:  వద్దు.. నేను పరిగెత్తుకుంటూనే ఇంటికెళ్తాను.  

వినోద్‌:  నువ్వు ఎందుకు అలా పరిగెడుతున్నావ్‌?  

ప్రదీప్‌:  నేను రోజూ ఇంటికి ఇలాగే వెళ్తాను.  

వినోద్‌:  ఎక్కడ పనిచేస్తావ్‌?  

ప్రదీప్‌:  మెక్‌ డోనాల్డ్స్‌  

వినోద్‌:  రా.. నా కారులో డ్రాప్‌ చేస్తాను  

ప్రదీప్‌:  వద్దు. నాకు మళ్లీ పరిగెత్తేందుకు టైం దొరకదు  

వినోద్‌:  ఎందుకు ఇలా పరిగెడుతున్నావ్‌?  

ప్రదీప్‌:  ఆర్మీలో చేరేందుకు ప్రాక్టీస్‌ చేస్తున్నా.  

వినోద్‌:  ఉదయమే రన్నింగ్‌ చేయొచ్చు కదా..!  

ప్రదీప్‌:  ఉదయాన్నే నేను లేచి వంట చేసుకుని పనికెళ్లాలి. అప్పుడు టైం ఉండదు.  

వినోద్‌:  ఈ వీడియో వైరల్‌ అయితే ఎలా..?  

ప్రదీప్‌:  నన్నెవరు గుర్తుపడతారు. వైరల్‌ అయినా ఓకే.. నేనేం తప్పు చేయట్లేదు కదా.  

వినోద్‌:  రా.. మనిద్దం కలిసి డిన్నర్ చేద్దాం.  

ప్రదీప్‌:  లేదు. ఇంట్లో అన్న ఉన్నాడు. నేను వెళ్లి ఇద్దరికీ వంట చేయాలి. లేదంటే తను తినడు.   

వినోద్‌:  మీ అన్న వంట చేసుకోలేడా?  

ప్రదీప్‌:  అతనికి నైట్‌ షిఫ్ట్‌ వర్క్‌ ఉంది.  

వినోద్‌:  సరే.. ఈ రోజుకు మీ ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తాను రా.  

ప్రదీప్‌:  వద్దు. నేను రోజూ ఇలాగే వెళ్తా. ఈరోజు మీతో వస్తే నా ప్రాక్టీస్‌కు ఆటంకం కలుగుతుంది.   

ఈ సంభాష‌ణ త‌ర్వాత డైరెక్ట‌ర్ కార్ స్లో చేస్తాడు. ఆ యువ‌కుడు అలానే ప‌రుగెత్తుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. ఈ వీడియో ట్విట్ట‌ర్‌లో అప్‌లోడ్ చేయ‌గానే ల‌క్ష‌లాది వ్యూస్ వ‌చ్చాయి. అంతా ఆ 19 ఏళ్ల ప్ర‌దీప్ మెహ్రా ప‌ట్టుద‌ల‌ను ప్ర‌శంసిస్తున్నారు.