యూపీలో మద్యంపై కౌ టాక్స్

 

మనం వాట్,సర్వీస్ టాక్స్,ఇన్ కమ్ టాక్స్ విన్న పేర్లే. ఇప్పుడు కొత్తగా జీఎస్టీ అనే పదం వింటున్నాం. కానీ కౌ టాక్స్ అనే పదం మనం ఇంతవరకు విన్లేదు. కౌ టాక్స్ కట్టాలి అంటే యూపీలో మద్యం తాగాలి. యూపీ ప్రభుత్వం కొత్తగా కౌ టాక్స్ అంటూ పన్నులు వసూలు చేయటానికి సిద్దమయింది. రాష్ట్రంలో గోవుల రక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలకు కావాల్సిన డబ్బులను మద్యం ద్వారా రాబట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ ఫీజు వసూలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలో నిర్మిస్తున్న గోశాల కోసం ఖర్చు చేయనున్నారు.

ప్రత్యేక రుసుము నిర్ణయంతో రెస్టారెంట్లు, హోటల్స్ లో విదేశీ మద్యంపై రూ.10, స్వదేశీ మద్యంపై రూ.5 అదనంగా వసూలు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో మద్యం తయారీ, దిగుమతులు జరుపుతున్న డిస్టిల్లరీస్, బ్రేవరేజెస్ లపై కూడా అదనపు రుసుము వసూలు చేస్తారు. స్పెషల్ ఫీజు వసూలు ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.165 కోట్లు అందించవచ్చనే ఆలోచనలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉంది. రాష్ట్రంలో మద్యంపై రుసుము విధానాన్ని ఎక్సైజ్ మంత్రి జై ప్రతాప్ సింగ్  వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వ ఆదేశాలతో వెనక్కి తగ్గి, ఎక్సైజ్ శాఖ నుంచి ఏటా రూ.165 కోట్లు ప్రభుత్వానికి అందించాలని నిర్ణయించామని తెలిపారు. మద్యం తాగి ఆరోగ్యం పాడవుతుందని భాదపడాలా లేక మనం కట్టే కౌ టాక్స్ తో గోవుల సంరక్షణ జరుగుతుందని సంతోషపడాలా? మందుబాబులు మీరే చెప్పాలి..!