యోగా ఎంత తేలికో మీరే చూడండి!

 

యోగా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. టకటకా యోగాసనాలు వేసేసి అందాన్నీ, ఆరోగ్యాన్నీ, మానసిక ప్రశాంతతనీ పొందాలని ఎవరికి అనిపించదు. కానీ యోగా చేయడం ఎలా? అన్న ప్రశ్న దగ్గరే అందరూ ఆగిపోతూ ఉంటారు. కష్టమైన ఆసనాలు వేయడానికి ఎవరో ఒక గురువు దగ్గరకి వెళ్లడం తప్పనిసరే! కానీ అంతవరకు కొన్ని తేలికైనా ఆసనాలు వేసి కావల్సినంత ఆరోగ్యాన్ని పొందవచ్చునంటున్నారు. ఆ ఆసనాలు ఏంటో మీరే చూడండి...

వృక్షాసనం

ఈ ఆసనంలో ముందుగా రెండు చేతులనీ నమస్కార భంగిమలో పైకి ఎత్తండి. మీ వెన్ను నిటారుగా ఉండేటా గమనిస్తూ, మీ కుడిపాదాన్ని, ఎడమ మోకాలి పైన ఉంచండి. ఇలా చేసే సమయంలో ఊపిరిని లోపలకి పీలుస్తూ ఉండాలి. ఆ తర్వాత ఊపిరిని నిదానంగా వదులుతూ, కాలుని కిందకి దించండి. ఇదే పద్ధతిలో మీ రెండో కాలుని కూడా వృక్షాసనంలో నిలపండి.

త్రికోణాసనం

ఇది మనం స్కూల్స్‌లో చూసే ఎక్సర్‌సైజ్‌లాగానే ఉంటుంది. దీనికోసం మీ రెండు కాళ్లనూ కాస్త వెడంగా ఉంచాలి. మీ శరీర బరువు మొత్తం మీ రెండు కాళ్ల మీదా సమానంగా ఉండేలా గమనించుకోవాలి. ముందు మీ కుడి చేతిని నేలమీద నిటారుగా తాకించాలి. ఆ సమయంలో మీ చూపు, ఎడమచేయి ఆకాశం వైపు నేరుగా చూస్తుంటాయి. ఆ తర్వాత ఇదే పద్ధతిని ఎడమచేతితోనూ కొనసాగించాలి.

తాడాసనం

ఈ ఆసనంలో ముందుగా రెండు అరచేతులూ బయటకు కనిపించేలా పెనవేయాలి. ఆపై వాటిని నిదానంగా తలమీదకు తీసుకువెళ్లాలి. చేతులని పైకి ఉంచాక, మునివేళ్లతో కాళ్లని పైకి ఎత్తాలి. ఈ ఆసనం వేసేటప్పుడు వెన్ను, కాళ్లు నిటారుగా ఉండాలి; ఏకాగ్రత తొడ కండరాల మీద ఉండాలి; చూపు కూడా నేరుగా ఉంచాలి.

నౌకాసనం

ఒక పడవలాంటి ఆకారంలో ఉండటమే ఈ నౌకాసనం. దీనికోసం నేల మీద వెల్లికిలా పడుకోవాలి. ఆపై నిదానంగా ఇటు చేతులనీ, అటు కాళ్లనీ కూడా కాస్త దగ్గరకి తీసుకురావాలి. అంటే మీ నడుము బేస్‌గా చేసుకుని, శరీరం ఒక V షేప్‌లోకి రావాలన్నమాట. పొట్ట కరగాలన్నా, డైజషన్‌కి సంబంధించిన సమస్యలు తీరిపోవాలన్నా, ఆడవాళ్లకి సంబంధించిన ఇబ్బందులు పోవాలన్నా... ఈ నౌకాసనం గొప్ప ప్రభావం చూపుతుంది.

భుజంగాసనం

ఇది నౌకాసనానికి పూర్తిగా వ్యతిరేకం అనుకోవచ్చు. ఇందులో బొక్కబోర్లా నేల మీద పడుకుని, తల నుంచి నడుము వరకు వీలైనంతవరకు పైకి ఎత్తే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనం వల్ల ఛాతీకి, పొట్టకి సంబంధించి ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయి. వెన్నెముకకి మంచి flexibility వస్తుంది.

యోగా చేసే ఓపిక, సంకల్పం ఉండాలే కానీ... ఇలాంటి తేలికైనా ఆసనాలు చాలానే కనిపిస్తాయి. మరెందుకాలస్యం... యోగా మన వల్ల కాని పని అన్న నమ్మకాన్ని పక్కన పెట్టేసి, ముందు ఇలాంటి చిన్నచిన్న ఆసనాలతో మీకు కావల్సినంత ఆరోగ్యాన్ని సంపాదించేయండి.

 

International Yoga Day 2018 Special Videos