చాప కింద నీరులా ఎర్రబెల్లి..
Published on: Sat Feb 13, 2016 11:15AM
.jpg)
ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. ఈయన పార్టీ మార్పుపై ఎప్పటినుండో వార్తలు చక్కర్లు కొడుతున్నా.. ఆయన టీఆర్ఎస్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నా ఆయన మాత్రం వాటిని ఖండిస్తూనే వచ్చారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న అనంతరం ఆయన చాలా సైలెంట్ గా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు.
అయితే పార్టీలోకి ఆహ్వానించే వాళ్లు ఎంత మంది ఉన్నా.. సదరు వ్యక్తికి వ్యతిరేకంగా ఉండేవాళ్లు కూడా ఉంటారు. అలానే టీఆర్ఎస్ లో కూడా అలాంటి వారు లేకపోలేదు. ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరకుండా ఎప్పటినుండో అడ్డుకుంటూ వస్తున్న రంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎర్రబెల్లి చేరికతో ఖంగుతిన్నారట. వారెవరోకాదు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఎందుకంటే ఎర్రబెల్లి చేరికతో ఎప్పటి నుండో మంత్రి పదవి ఆశిస్తున్న వారికి నోట్లో వెలక్కాయ పడినంత పనైంది. అంతేకాదు వీరిద్దరి స్థానంలో ఇప్పుడు ఎర్రబెల్లి మంత్రి అవుతారన్న వార్తలతో వీరు లోలోన రగిలిపోతున్నారట.
మరోవైపు కేసీఆర్ కూడా ఎర్రబెల్లి తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు పెద్ద పీఠవేశారని.. ఇక డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కూడా చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇస్తారని కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు జిల్లాలో చాలా రోజుల తర్వాత ఎర్రబెల్లి హవా కొనసాగేందుకు కేసీఆర్ స్వయంగా మార్గం సుగమం చేస్తున్నారన్న టాక్ ఓరుగల్లు రాజకీయాల్లో వినిపిస్తోంది. మరి టీడీపీలో ఉన్నప్పుడు ఎర్రబెల్లికి అక్కడ ప్రాధాన్యత బానే ఉండేది. మరి టీఆర్ఎస్ కేసీఆర్ కూడా తనకు అలాంటి ప్రాధాన్యతే ఇస్త్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చాప కింద నీరులా టీఆర్ఎస్ లో కూడా ఎర్రబెల్లి తన మార్కును అలాగే కొనసాగించేలా ఉన్నారు. దీనిని టీఆర్ఎస్ నేతలు ఎలా జీర్ణించుకుంటారో చూద్దాం..


