ఎర్రబెల్లి ఎందుకు చిందులేస్తున్నారు?
Published on: Fri Aug 24, 2012 7:52AM
ఏమిటో తెలుగుదేశం సారధ్యబాధ్యతలన్నీ ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావే మోసేస్తున్నట్లున్నారు. అంతకష్టపడి మోయటం వరకూ బాగానే ఉంది కానీ, తాము ప్రతిపక్షమన్న విషయం కూడా ఆయన మరిచిపోయినట్లున్నారు. అందుకే ముందురోజేమో పంజాగుట్ట పోలీస్‌స్టేషనులో విద్యుత్తు సమస్యపై కారాలు, మిరియాలు నూరిన దయాకరరావు రెండో రోజుకే కరిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ పాపం ఆ విద్యుత్తుశాఖను నడపలేకపోతోంది కాబట్టి తమకు అప్పగించేయాలని దయాకరరావు ప్రభుత్వంపై దయతలచారు. ఇంతకీ తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా విదేశాలకు వెళ్లినప్పుడే ఎర్రబెల్లి ఎందుకు అంతబాగా ఫైరయ్యారు? ఓ తమ నేత వచ్చేటప్పటికీ తానే హాట్ సబ్జెక్టు అవ్వాలనుకున్నారేమో! అంత వరకూ ఓకే కానీ, ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రభుత్వంలో ఒకశాఖను తమకు అప్పగించటం ఎంత వరకూ కరెక్టు? పోనీ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దయాకరరావు మీద దయతలచి ఆ శాఖను అప్పగించాలంటే ఆయన ఏమి చేయాలి? అసలు దయాకరరావు ఒక్కసారైనా ఆలోచించి మాట్లాడావా? అని రాష్ట్రం మొత్తం ఈయన రెండు రోజుల చేష్టలు చూసి ప్రశ్నిస్తోంది. తెలుగుతమ్ముళ్లు మాత్రం దయాకరరావు మీద దయచూపారు లేకపోతే ఈపాటికి ఫోన్లుతో ఆయన్ని ఊదరగొట్టి చంపేసేవారే కదా! మళ్లీ తెరపైకి, మీడియా దగ్గర కొచ్చి ఆ శాఖను అప్పగించమంది ఆవేశంలోనే అని తప్పుదిద్దుకునే అవకాశం తమ్ముళ్లు ఆయనకు ఇవ్వలేదు. మరి బాబు తిరిగి వచ్చాక ఈయన్ని సంస్కరిస్తారో లేక తాను కూడా కాంగ్రెస్ పార్టీని విద్యుత్తు శాఖ ఇచ్చేయమని కోరుతారో చూద్దాం!


