కమలం చుట్టూ ఈగలు

 

 

బీజేపీకి దక్షిణాదిన అధికారం కట్టబెట్టిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీ రాజ్యం ఏలిందక్కడ. కానీ మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప అవినీతి భాగోతాల పుణ్యామాని ఉన్నఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా పోగొట్టుకొంది. వాపును చూసి బలుపని భ్రమసిన ఎడ్యూరప్ప కర్ణాటక జనపక్ష పార్టీ పెట్టి బీజేపీని రాష్ట్రంలో నుండి తరిమి కొడతానని ప్రతిజ్ఞ చేసారు. కానీ ఆయన పార్టీని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆయన బీజేపీని రాష్ట్రం నుండి తరిమికొట్టలేకపోయినా ఎన్నికలలో గెలవకుండా సైంధవుడిలా అడ్డుపడి, అధికారాన్నికాంగ్రెస్ చేతికి అప్పగించగలిగారు. అందుకు బీజేపీ ఆగ్రహించకపోగా ఆయనను దూరం చేసుకొన్నందునే ఎన్నికలలో ఓడిపోయామని భావించడం ఆశ్చర్యం. అదేవిధంగా ఎడ్యూరప్ప కూడా బీజేపీని వదిలిపెట్టి బయటకి వచ్చినందునే ఓడిపోయానని పశ్చాతాపపడుతూ, మళ్ళీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అయితే ఇంతకాలం వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నందున, అవినీతికి మారుపేరయిన ఎడ్యూరప్పను పార్టీలో చేర్చుకొంటే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని, అదీ గాక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అదొక ఆయుధంగా మారుతుందని భావించిన బీజేపీ, ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ఇంతకాలం దూరంపెట్టింది. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి గనుక, ఆయనకు ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికి తిరిగి పార్టీలో చేర్చుకొంది. ఈ రోజు ఎడ్యూరప్ప తన అనుచరులతో కలసి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద జోషీ మరి కొందరు సీనియర్ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన తన కర్ణాటక జనపక్ష పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుండి, బీజేపీ నేతలు కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించే ముందు వారు ఎడ్యూరప్పఅవినీతి భాగోతాల గురించి లేవనెత్తే ప్రశ్నలకు జవాబీయడానికి సిద్దంగా ఉండాల్సి ఉంటుంది.