TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ ఎమ్మెల్యేలపై కార్యకర్తల తిరుగుబాట్లు.. ఓటమి భయం పట్టేసిందా? 

Published on: Wed Dec 29, 2021 10:07AM

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా? ఎమ్మెల్యేలకు భవిష్యత్ చిత్రం కనిపిస్తోందా? వైసీపీ కార్యకర్తలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారా? అంటే ఆ పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ అసంతృప్తి కనిపిస్తోంది. స్థానిక నేతలు బహిరంగంగానే బయటికి వచ్చి ఏకంగా జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను ఎదిరిస్తున్నారు. పదేళ్లుగా జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేదంటూ తిరుగుబాటు చేస్తున్నారు.  అధికారుల వద్ద గౌరవం లేదని, వాలంటీర్లు మాట వినడం లేదని, అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి ఉందంటున్నారు వైసీపీ స్థానిక నేతలు. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 

విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై స్థానిక వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారు. బంగారమ్మపాలెంలో ఎంపీపీ శారదాకుమారి వర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయన మనకిస్తున్న విలువ ఏదీ?’అంటూ పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేసినా మంత్రి పదవి రాలేదంటున్నారు.. మా ఆయన 21 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు.. ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదు.. ఇకపై కూడా రాకుండా చేయాలని చూస్తున్నారు.. మా గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ ఎంపీపీ  కంటతడి పెట్టారు. కులం, డబ్బుకు ఎమ్మెల్యే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఎంపీపీ భర్త బొలిశెట్టి గోవిందరావు. బాబూరావు ఓడిపోతారని పందెం కాసిన వారికి ప్రాధాన్యం ఇస్తూ.. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ఇకపై తాను ఎమ్మెల్యే ముఖం చూడనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో తిమ్మాపురం పంచాయతీ రికార్డులను డీఎల్‌పీవో తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించారు. సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేయాలని చూస్తున్న ఎమ్మెల్యే మనకు అవసరం లేదన్నారు. 

సీఎం జగన్ సొంత గడ్డ కడప జిల్లాలోనూ వైసీపీలో వర్గ పోరు రోడ్డెక్కింది. రాజంపేట నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య విభేదాలు కాసేపు ఉద్రిక్తతకు దారితీశాయి. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సమక్షంలోనే  సుండుపల్లి మండలంలో  ఆయా వర్గాలు తోపులాటకు దిగాయి. వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీ సభ ముగియగానే  ఎమ్మెల్యే వెంట ఆయనకు వరుసకు సోదరుడయ్యే, మండలంలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మేడా విజయశేఖర్‌రెడ్డి, మరికొందరు లోపలికి ప్రవేశించారు. అప్పటికే లోపల నేతలు... తాము ఎంపీ, ఎమ్మెల్యేలతో మాట్లాడాలని, మీరు కాసేపు బయటికి వెళ్లండని విజయశేఖర్‌రెడ్డిని కోరారు. ఆయన బయటికి వెళుతుండగా.. ‘మా నాయకుడినే వెళ్లమంటారా? అంత ధైర్యం ఎవరికి ఉంది?’ అంటూ ఆయన అనుచరుడు నాగేంద్ర నాయక్‌ గట్టిగా కేకలు వేశారు. ప్రజాప్రతినిధుల ముందే పరస్పరం తోపులాటకు దిగాయి. కేకలు, అరుపులతో గొడవకు దిగారు.  పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.